భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు ఉన్న వృద్ధి రేటు ఏమాత్రం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఆశాజనకం కాదన్నారు.

ఉద్యోగాలకు ఇది సరిపోదు..
మన దేశంలో యువత పెద్ద ఎత్తున ఉందని, వీరిలో ఏటా ఉద్యోగార్థులుగా వస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోందని రాజన్ అన్నారు. అయితే ప్రస్తుత వృద్ధి రేటుతో వీరందరికీ సరిపడా ఉద్యోగాలు రావని చెప్పారు. అందుకే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టే కీలక సంస్కరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆర్థిక వ్యవస్థ సాగటం లేదన్నారు.

చైనా నుంచి తరలే పరిశ్రమలను ఆకర్షించాలి
చైనా నుంచి పరిశ్రమలు వియత్నాంకు తరలిపోతున్నాయని రఘురాం రాజన్ గుర్తు చేశారు. వాటిని భారత్ సైతం ఆకర్షించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి రేటు అంచనా ఉందని, దీంతో ఫలితం లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు కీలక సంస్కరణలు అవసరమన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు
దేశంలోనీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడుల ద్వారా ఎకానమీ ఒత్తిడిని తగ్గించవచ్చునని రాజన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్లు నిర్మించడం, ఎక్కువ బదలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రాణాళికలో ఖర్చులు పెంచడం వంటి మార్గాల ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని చెప్పారు.

మోడీ ప్రభుత్వానికి సూచన
రాజన్ సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో సంస్కరణల వేగం తగ్గిందని, గత పదిహేనేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధిరేటు పెరిగితేనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఎగుమతులను పెంచుకునేలా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణి జ్య ఒ ప్పందాలను కుదుర్చుకోవాలని మోడీ ప్రభుత్వానికి సూచించారు. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగాలని, గ్రామీణుల కొనుగోళ్ల శక్తి పుంజుకుంటేనే గాడిన పడుతుందన్నారు.


Click it and Unblock the Notifications