Investment: తన పెట్టుబడుల సీక్రెట్స్ వెల్లడించిన రఘురామ్ రాజన్..!!
Raghuram Rajan: భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక కీలక అంశాలపై అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ తన పెట్టుబడులు, పోర్ట్ ఫోలియో గురించిన కీలక అంశాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానొక సాంప్రదాయక పెట్టుబడిదారుడినని రాజన్ పేర్కొన్నారు. అందువల్ల తన డబ్బును ఎక్కువగా ఇండెక్స్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. రాజన్ వాస్తవానికి 2013-2016 మధ్య కాలంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా సేవలందించారు.

ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టలేదని పేర్కొన్నారు. తాను అమెరికా సంస్థలు లేదా కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని రాజన్ స్పష్టం చేశారు. గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు ఆసక్తికి విరుద్దంగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో భారతీయ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రిజర్వు బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా గుర్తించిన ఆర్థిక వేత్తల్లో ఒకరుగా రఘురామ్ రాజన్ కావటం విశేషం.
రాజన్ ప్రస్తుతం తన తాజా పుస్తకం 'బ్రేకింగ్ ది మౌల్డ్'ని ప్రచారం చేయడానికి భారతదేశంలో ఉన్నారు. అతను పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఆర్థికవేత్త అయిన రోహిత్ లాంబాతో కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. ఇటీవల రెండవ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధికి అమెరికా ఎకానమీ పుంజుకోవటంతో పాటు కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం ప్రధాన కారణాలుగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో రాజన్ ఈ వృద్ధి కేవలం 5 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయటంతో సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొన్నారు.


Click it and Unblock the Notifications