US Fed: ఈవారం ప్రారంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు అమెరికా ఫెడ్ సమావేశంపై దృష్టి సారించాయి. వడ్డీ రేట్లు పెంచుతుందా, తగ్గిస్తుందా లేక స్థిరంగా ఉంచుతుందా అనే ఉత్కంఠకు తెర పడింది. దాదాపు ఫెడ్ రేట్ల పెంపు సైకిల్ చివరికి చేరినట్లు తెలుస్తోంది.
వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఫెడ్ ప్రకటించింది. సెప్టెంబర్ 20న వడ్డీ రేట్లను 5.25-5.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఏడాది చివర్లో పెంపు ఉండొచ్చని చేసిన ప్రకటనతో రెండేళ్ల ట్రెజరీ బాండ్ ఈల్ట్స్ 17 ఏళ్ల గరిష్ఠ స్థాయి 5.18 శాతానికి, 10 ఏళ్ల బెంచ్ మార్క్ బాండ్స్ ఈల్డ్స్ 16 ఏళ్ల గరిష్ఠమైన 4.39 శాతాన్ని తాకింది.

యూఎస్ బాండ్ ఈల్డ్స్ మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల తాజా ఫెడ్ నిర్ణయం భారత మార్కెట్లను సమీప కాలంలో పాడు చేస్తుందని వారు భావిస్తున్నారు. బాండ్ ఈల్డ్స్ పెరగటం వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకెళ్లటాన్ని పెంచుతారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించటం ప్రారంభమైంది. కీలక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలతో దిగజారాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెరుగుతున్న కరెన్సీ రిస్కుల కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు కొనసాగించటం కంటే అమెరికా బాండ్స్ లో పెట్టుబడులు పెట్టి అధిక రాబడిని పొందేందుకు ఇష్టపడతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ తెలిపారు. ఈ క్రమంలో నిన్న సెప్టెంబర్ 20న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు రూ.3,110 కోట్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను ఆఫ్‌లోడ్ చేశారు. మెుత్తానికి ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ.5,213 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.


Click it and Unblock the Notifications