Foreign Investments: కరోనా విజృంభణ తర్వాత నుంచి చైనాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ప్రపంచ కర్మాగారంగా పేరొందిన గతవైభవాన్ని క్రమేపీ కోల్పోతూ వస్తోంది. పలు కంపెనీలు ఇప్పటికే చైనా వదిలి వెళ్లిపోగా, మరికొన్ని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమయంలో విడుదలైన ఫారిన్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
గత త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారులు చైనా నుంచి రికార్డు స్థాయిలో తమ ఇన్వెస్ట్‌మెంట్స్ వెనక్కి తీసుకున్నట్లు ఆ దేశ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య డ్రాగన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లైయబిలిటీస్ దాని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో దాదాపు 15 బిలియన్ డాలర్ల మేర పడిపోయాయినట్లు నివేదిచింది. ఈ ఏడాది మొదటి 6 నెలలకుగాను దాదాపు 5 బిలియన్ డాలర్లు తగ్గింది. చైనాకు ఇలా ప్రతికూలత ఎదురడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

2021లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 344 బిలియన్ డాలర్లకు చేరిన తర్వాత ఇటీవల క్షీణించడం మొదలుపెట్టాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, పెరుగుతున్న భౌగోళిక మరియు రాజకీయ ఉద్రిక్తతలు వల్ల కొన్ని కంపెనీలు తమ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకునేలా చేశాయి. ప్రజలు వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం కూడా విదేశీ కార్ కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ఇవన్నీ వెరసి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా తగ్గించుకొనేలా ప్రేరేపించాయి.
దీన్ని గమనించిన డ్రాగన్.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉన్నవాటిని నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో గతేడాది రికార్డు స్థాయిలో క్షీణత చవిచూసింది. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ట్రాక్ చేసే SAFE డేటా ప్రకారం.. బహుళజాతి కంపెనీలు చైనాలో కాకుండా ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు బీజింగ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండగా.. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు పెంచుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
రెండవ త్రైమాసికంలో కంపెనీలు 71 బిలియన్ డాలర్లను విదేశాలకు పంపడంతో చైనీస్ అవుట్‌బౌండ్ పెట్టుబడి కూడా గరిష్ఠ స్థాయిని తాకింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 80 శాతం ఎక్కువ కావడం ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదిక ప్రకారం.. వస్తువుల ఎగుమతి, దిగుమతులను రికార్డ్ చేయడానికి ఉపయోగించే వివిధ పద్ధతుల వల్ల ఈ వ్యత్యాసం సంభవించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications