IT News: విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలోని తమ డబ్బును వేగంగా తరళిచ్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి దేశంలో 300 కంటే తక్కువ స్థానాలు వస్తాయనే అంచనాలు మార్కెట్లలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఐటీ సేవల కంపెనీ షేర్లలోని పెట్టుబడులను విక్రయిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం మధ్య వ్యాపార మందగమనంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారతీయ ఐటీ రంగం పట్ల బేరిష్ సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. తాజా డేటా ప్రకారం వారు జనవరి-ఏప్రిల్ 2024లో ఇండియన్ ఐటీ రంగం నుండి రూ.4,550 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. మే 9 నాటికి బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఏడాది ప్రాతిపదికన 5 శాతం పడిపోయింది.

భారతీయ ఐటీ సేవల కంపెనీ షేర్లలో పతనం గమనిస్తే.. ఇన్ఫోసిస్ స్టాకం 7 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్టాక్ 10 శాతం ఏడాది ప్రాతిపదికన క్షీణతను నమోదు చేశాయి. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, టాటా టెక్నాలజీస్, బిర్లా సాఫ్ట్, ఎంఫాసిస్, ఎల్‌టిఐఎమ్ మైండ్‌ట్రీ కంపెనీ షేర్లు 4 శాతం నుంచి 26 శాతం మధ్య క్షీణతను నమోదు చేశాయి. అయితే ఇదే సమయంలో టీసీఎస్ కంపెనీ షేర్లు మాత్రం 4 శాతం మేర లాభపడ్డాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ పతనంతో IT స్టాక్‌లలోని FPIల పెట్టుబడులు డిసెంబర్ 31, 2023 నాటికి రూ.6 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ 30, 2024 నాటికి రూ.5.64 లక్షల కోట్లకు పడిపోయాయి.
బ్రోకరేజ్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగానికి సంబంధించిన వైఖరి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.IT సేవల్లో బలహీనమైన పనితీరుతో FY24 మరో త్రైమాసికంలో ముగిసింది. ప్రభుదాస్ లిల్లాదర్ బ్రోకరేజ్ ప్రకారం హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లకు రూ.1,550 టార్గెట్ ధరతో BUY రేటింగ్ అందించింది. ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్ మైండ్‌ట్రీ టార్గెట్ ధరను రూ.5,015గా, టీసీఎస్ షేర్ల టార్గెట్ ధరను రూ.4,360గా అందించింది.
ఇదే క్రమంలో జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ అనలిస్ట్ వినోద్ మాట్లాడుతూ రానున్న కాలంలో ఐటీ సేవల కంపెనీల వృద్ధి మోడరేట్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా వేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్లు కలిగిన కంపెనీలపై దృష్టి సారించడం, ముఖ్యంగా బలమైన డీల్ విజయాలతో ఏఐ, జనరేటివ్ ఏఐ సాంకేతికతల్లో నిమగ్నమై ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. రిస్క్ తగ్గించుకునేందుకు పెట్టుబడులను వివిధ రంగాలకు డైవర్ట్ చేయాలని చెప్పారు.


Click it and Unblock the Notifications