Banking News: గతవారం చివరిలో దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంక్ నికర లాభం 20 శాతం పెరిగి రూ.10,708 కోట్లకు చేరుకోవటంతో ఇన్వెస్టర్లకు మంచి కాలం వచ్చింది.
దీంతో నేడు మార్కెట్లో కంపెనీ షేర్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 4.72 శాతం పెరిగి రూ.1,160.15 స్థాయి వద్ద స్థిరపడింది. అలాగే ఇంట్రాడేలో కంపెనీ షేర్లు గరిష్ఠంగా 5 శాతం పెరిగాయి. బలమైన లాభాలను మార్చి త్రైమాసికంలో నమోదు చేయటంతో స్టాక్ పరుగులు కంపెనీ మార్కెట్ విలువను తొలిసారిగా రూ.8 లక్షల కోట్ల మార్కును అందుకోవటంలో దోహదపడ్డాయి. దేశంలోని లిస్టెడ్ కంపెనీల్లో ఈ మార్కును అందుకున్న 6వ కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చరిత్రను సృష్టించింది.

దీనికి ముందు మార్కెట్లో జాబితా అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్ కంపెనీలు ఇప్పటి వరకు రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.20.4 లక్షల కోట్లుగా ఉండటంతో దేశంలోనే అత్యధిక విలువ కలిగిన కంపెనీగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.9.6 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇన్ఫోసిస్ రూ.8.16 లక్షల కోట్లు, ఎయిర్ టెల్ రూ.8.1 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న సంస్థలుగా నిలిచాయి.
ఇటీవల కంపెనీ పనితీరుపై జేఎమ్ ఫైనాన్షియల్స్ సానుకూలంగా స్పందిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ ఇతర పోటీదారు బ్యాంకులతో పోల్చితే బెస్ట్-ఇన్-క్లాస్ రిటర్న్ అందించినట్లు పేర్కొంది. ఇదే విధంగా బ్యాంక్ FY24లో 2.4 శాతం ROAని సాధించింది. ఈ క్రమంలో నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.19,093 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ బలమైన ఆస్తి నాణ్యతతో పాటు ఆరోగ్యకరమైన అడ్వాన్స్‌లు, డిపాజిట్లతో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది.


Click it and Unblock the Notifications