Zomato Share: బుల్లెట్ రైలు వేగంలో జొమాటో కంపెనీ షేర్లు.. సెంచరీ దాటిన రేటు.. ఎందుకంటే..?
Zomato Share: దేశంలో అతిపెద్ద ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ గా ఉన్న జొమాటో ఇటీవలి ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. జూన్ త్రైమాసికాలో కంపెనీ తన మాటను ముందుగానే నిలబెట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 8 శాతం పెరిగి రూ.100 మార్కును దాటాయి. ట్రేడింగ్ సమయంలో రూ.102.8 స్థాయికి చేరుకున్న స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో స్టాక్ 5 శాతం మేర లాభపడి రూ.100 వద్ద నిలిచింది. అయితే మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో షేర్ ధర రూ.97 వద్ద స్థిరపడింది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.44.35గా ఉంది.

గతవారం జొమాటో తన జూన్ తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో స్టార్టప్ కంపెనీ తొలిసారిగా లాభాలను నమోదు చేసింది. జూన్ క్వార్టర్ లో కంపెనీ ఏకంగా రూ.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని అందుకున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.186 కోట్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అలాగే మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.187.6 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
జూలై 2021న జొమాటో కంపెనీ షేర్లు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ సమయంలో కంపెనీ ఒక్కో షేరుకు ఇష్యూ ధరను రూ.76గా నిర్ణయించింది. అయితే లిస్టింగ్ సమయంలో కంపెనీ షేర్లు రూ.115గా జాబితా చేయబడ్డాయి. ఆ తర్వాత కుప్పకూలిన స్టాక్ కనీసం లిస్టింగ్ ధరను మించలేదు. దీంతో ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన, నిరాశకు గురయ్యారు. కానీ కంపెనీ పనితీరుతో ప్రస్తుతం స్టాక్ బుల్లెట్ రైలు వేగంతో మార్కెట్లో పెరుగుతోంది.


Click it and Unblock the Notifications