Zomato News: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో.. ఆ ఛార్జీలు 25 శాతం పెంచేసిన స్టార్టప్..
Zomato Platform Fee: ప్రస్తుతం దేశంలోని ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీల వ్యాపారం భారీగా ఊపందుకుంది. కరోనా కాలం నుంచి చాలా మంది వీటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేందుగా అలవాటు పడటంతో కంపెనీలు ప్రస్తుతం ఈ అవకాశాన్ని ఆదాయంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఏకంగా 25 శాతం పెంచి ఆర్డర్‌పై ఛార్జీని రూ.5కి పెంచేసింది. గతంలోనే ఒకసారి ఛార్జీల పెంపు గురించి చర్చ వచ్చినా అది ఇప్పుడు అమలులోకి రావటంతో కస్టమర్లకు పెద్ద షాక్ తగిలింది. క్యూ4 ఆర్థిక ఫలితాల వెల్లడికి కొన్ని రోజుల ముందర కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇదే సమయంలో జొమాటో తన ఇంటర్‌సిటీ లెజెండ్స్ ఫుడ్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఆదాయాలను పెంచుకుని లాభదాయకమైన కంపెనీగా మారేందుకు ప్రయత్నిస్తున్న జొమాటో.. ఆగస్ట్ 2023లో జొమాటో తన మార్జిన్‌ని పెంచడానికి, కంపెనీని లాభదాయకంగా మార్చడానికి రూ.2 ప్లాట్‌ఫారమ్ ఫీజును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దీనిని రెండు విడతల్లో రూ.4కి పెంచారు. దీనికి ముందు డిసెంబర్ 31న కంపెనీ ప్లాట్‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా రూ.9కి పెంచింది. ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు వల్ల డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ ప్రభావం పాక్షికంగా తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీకి అదనంగా రూ.85-90 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత పెంపు కొన్ని నగరాలకే పరిమితం చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు ఇతర నగరాల నుంచి ఫుడ్ డెలివరీ కోసం ప్రారంభించిన ఇంటర్ సిటీ టెజెండ్స్ ప్రధాన పట్టణాల్లోని టాప్ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లను డెలివరీ చేసేంది. అయితే దీనిలో మెరుగుదలలు జరుగుతున్నట్లు జొమాటో యాప్ చూపిస్తోంది. త్వరలోని సేవలు తిరిగి ప్రారంభించబడతాయని వెల్లడించింది. కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో సర్దుబాటు చేసిన ఆదాయంలో సంవత్సరానికి 30 శాతం వృద్ధితో రూ.2,025 కోట్లకు చేరుకోగా.. ఇదే కాలంలో బ్లింకిట్ ఆదాయం రెండింతలు పెరిగి రూ.644 కోట్లకు చేరుకుంది.
లాభదాయకంగా మారుతున్న కంపెనీ.. ఏడాది క్రితం రూ.347 కోట్ల నికర నష్టం నుంచి రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని అందుకుంది. ఇదే క్రమంలో ఆదాయం రూ.1,948 కోట్ల నుంచి రూ.3,288 కోట్లకు పెరిగింది. కంపెనీ పనితీరు భారీగా మెరుగుపడటంతో స్టాక్ సైతం సూపర్ లాభాలను అందించింది. గత ఏడాది కాలంలో 236.61 శాతం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. నేడు ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.192.15 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications