Zomato Weather: దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ సర్వీస్ అగ్రిగేటర్ జొమాటో తాజాగా మెగా ప్లాన్ కింద వాతావరణ వివరాలను అందించే సేవలను ప్రారంభించింది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే దేశంలో తొలి క్రౌడ్ సపోర్టెడ్ వెథర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ నిర్మిస్తున్నట్లు జొమాటో సీఈవో వెల్లడించారు. ఇది నిజసమయంలో వాతావరణ వివరాలను అందిస్తుందన్నారు. ఇది ఉష్ణోగ్రత, వర్షం, వాతావరణంలో తేమ, గాలి వేగంతో పాటు మరిన్ని వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని వెల్లడించారు. weatherunion.com ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గోయల్ ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. దీని కింద ప్రస్తుతం దేశంలో 650కి పైగా గ్రౌండ్ వెథర్ స్టేషన్లు ఉన్నట్లు వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ప్రైవేటు సంస్థ అయిన జొమాటో ఇంత భారీ స్థాయిలో వాతావరణ వివరాలను అందించే సేవలను అందుబాటులో తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది.

ప్రస్తుతం ఇది దేశంలోని 45 పెద్ద నగరాల్లో విస్తరించి ఉందని త్వరలోనే దీనిని మరింత బలోపేతం చేసే దిశగా జొమాటో అడుగులు వేస్తున్నట్లు వెల్లడైంది. వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు అందుకోవటం ద్వారా వ్యాపారులకు, రీసెర్చ్ సంస్థలకు ఉపయోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఐఐటీ దిల్లీతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించిన గోయల్ రానున్న కాలంలో మరిన్ని సంస్థలు తమ సేవలను వినియోగించి ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడాలని ఆకాంక్షించారు.
వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే తెలుసుకోవడం కస్టమర్ సేవల పరంగా కంపెనీ సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని గోయల్ పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమకు రియల్ టైమ్ వాతావరణ సమాచారాన్ని యాక్సెస్ చేయడం మాకు చాలా కీలకమన్నారు. దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది జొమాటో ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద వాతావరణ స్టేషన్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
ఇలాంటి స్టేషన్లను నిర్వహించటానికి స్థలాన్ని ఇచ్చే వాలంటీర్లను తాము స్వాగతిస్తున్నామని గోయల్ పేర్కొన్నారు. ఈ వివరాలను ఏపీఐ ద్వారా దేశంలోని అన్ని సంస్థలు, కంపెనీలు ఉచితంగా వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు జొమాటో వెల్లడించింది. దీనిని ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం కంపెనీలు, సంస్థలు వినియోగించాలని సూచించారు. వాస్తవానికి ఈ డేటా చాలా విలువైనదని తాము నమ్ముతున్నట్లు గోయల్ అన్నారు.


Click it and Unblock the Notifications