Swiggy IPO: మార్కెట్లోకి వరుసగా ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ సైతం ప్రస్తుతం కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలను మెుదలెట్టింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వద్ద ఐపీవో కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఐపీవో విలువ 1.25 బిలియన్ డాలర్లుగా ఉండనుందని తెలుస్తోంది. స్విగ్గీ షేర్‌హోల్డర్లు ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడైంది. కంపెనీ ఐపీవోలో 450 మిలియన్ డాలర్లు తాజా ఇష్యూ ఉండనుంది. ఐపీవోకి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లను సేకరించనుందని సమాచారం.

కంపెనీ గోప్యంగా ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. రహస్య మార్గంలో కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని బహిరంగంగా విడుదల చేయదు. రహస్య మార్గంలో దాని డ్రాఫ్ట్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన రెండవ పెద్ద కంపెనీగా స్విగ్గీ నిలిచింది. సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల ఓయో గత సంవత్సరం అలా చేసిన మొదటి పెద్ద స్టార్టప్ కంపెనీ నిలిచింది.
ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ స్విగ్గీ పదేళ్ల కిందట 2014లో స్థాపించబడింది. ఏప్రిల్ 10, 2024 నాటికి 12.7 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కంపెనీ కలిగి ఉంది. మార్చి 31,2023 నాటికి కంపెనీ వార్షిక ఆదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీలో 4,700 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.
2023 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 45 శాతం పెరిగి రూ.8,625 కోట్లకు చేరుకోగా.. దాని నష్టం రూ.4,179 కోట్లకు పెరిగింది. దీని ప్రత్యర్థి కంపెనీ జొమాటో 2022లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. జొమాటో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 66 శాతం పెరిగి రూ.7,761 కోట్లకు చేరగా, నష్టం రూ.971 కోట్లకు తగ్గింది.


Click it and Unblock the Notifications