కస్టమర్లపై మళ్లీ స్విగ్గీ ఫ్లాట్ ఫాం చార్జీల బాదుడు, ఈ సారి ఎంతో తెలుసా.. కంపెనీ స్పందన ఇదే..
ఫుడ్ టెక్ సంస్థ స్విగ్గీ మరోసారి కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ఫ్లాట్ ఫాం చార్జీలను పెంచేసింది. ముందు ఒక ఆర్డర్‌పై కేవలం రూ.2 మాత్రమే ఛార్జ్ చేసిన స్విగ్గీ.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీజును రూ.14వరకు పెంచుతూ నిర్ణయవ తీసుకుంది. ఇది దాదాపు 600 శాతం పెంపుగా ఉంది. అయితే స్విగ్గీ మాత్రం దీన్ని ఒక తాత్కాలిక చర్యగా తెలిపింది. కంపెనీ ప్రకారం.. పండగ కాలంలో (ఫెస్టివల్ సీజన్) ఆర్డర్ల సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ అవుతుంటుంది.
అప్పుడు ఎక్కువ డెలివరీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు ఖర్చులు వస్తాయి. వాటినే కవర్ చేయడానికి ఈ ఫీజు పెంపు తీసుకోవాల్సి వచ్చిందని స్విగ్గీ తెలిపింది. ఒక రకంగా చూస్తే ఇది Uber లేదా Ola లో ఉండే Surge Pricing తరహాలో కస్టమర్లు భావించవచ్చు. అయితే విచిత్రమేమిటంటే.. ప్లాట్‌ఫార్‌మ్ ఫీజు అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని నగరాల్లో ఇంకా రూ.10 వద్ద ఉంది. అయితే రెండేళ్ల క్రితం దీనిని ప్రారంభించే సమయంలో కేవలం ఇది 2 రూపాయలుగా ఉంది.
ఈ రంగంలో Swiggy మాత్రమే ఈ మార్పు తీసుకురాలేదు. Zomato, Zepto, Blinkit, BigBasket, Instamart లాంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థలు కూడా ఇదే దిశలో ప్రయాణిస్తున్నాయి. పేర్లు మాత్రం వేరే వేరుగా కనిపిస్తున్నాయి. కాని అంతిమంగా కస్టమర్లను మాత్రం బాదేస్తున్నాయి. Handling Fee, Convenience Charge, Small Order Fee ఇలా ఏ ఫీజు పడితే ఆ ఫీజు పెట్టి కస్టమర్ల జేబులు గుల్ల చేస్తున్నాయి. రెవిన్యూ పెంచుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు.సగటున ఈ ఫీజులు ఒక్క ఆర్డర్‌పై 1% నుండి 3% వరకు కూడా ఉండొచ్చు.

ఉదాహరణకు.. ఒక నెలలో 1 లక్ష ఆర్డర్లు ఉంటే, ఒక్కో ఆర్డర్‌పై రూ.5 పెంచితేనే 5 లక్షల రూపాయలు అదనంగా వస్తాయి. మీరు ఆర్డర్ చేసే వేళ ఇది ఒక చిన్న చార్జ్‌గా అనిపించినా, కంపెనీల దృష్టిలో మాత్రం ఇది కోట్ల రూపాయల వసూళ్లకు దారి తీసే మార్గంగా చెప్పుకోవచ్చు.
ఒకదశలో ఈ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీలతో వినియోగదారులను ఆకర్షించాయి. కానీ ఇప్పుడు మాత్రం పిండుకుంటున్నాయి. చిన్నచిన్న ఫీజుల ద్వారా లాభదాయకత (Profitability) దిశగా పయనిస్తున్నాయి. గతంలో వినియోగదారులు సేవను వాడాలి అనే కోణంలో ఉంటే ఇప్పుడు మాత్రం చెల్లించటానికి సిద్ధంగా ఉండాలని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఫీజు పెరిగినా ఆర్డర్ల పెరుగుదలలో ఏ మార్పు లేదని చెప్పవచ్చు.
ఫెస్టివల్ సమయాల్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లీట్ నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం దాన్ని ఫీజు పెంపు రూపంలో వినియోగదారులపై వేసుకుంటున్నాయి. ఇది తాత్కాలికమా..? లేక శాశ్వత మార్పు అవుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications