ITC Q1 Results: క్యూ1లో ఐటీసీ సూపర్ లాభాలు.. హోటల్ వ్యాపారం డీమెర్జర్..
ITC Q1 Results: దేశంలో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలోని దిగ్గజ కంపెనీ ఐటీసీ తన తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోల్చితే మంచి లాభాలను నమోదు చేసింది.
జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 17.58 శాతం పెరిగి రూ.4,903 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభాన్ని గమనిస్తే.. రూ.4,169.38 కోట్లుగా ఉంది. తాజాగా వచ్చిన ఫలితాలు మార్కెట్లో నిపుణుల అంచనాను మించినవి కావటంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు. అలాగే జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.16,995.40 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది కాలంలో నమోదైన రూ.18,320.16 కోట్ల కంటే 7.23 శాతం తక్కువ.

ఎఫ్‌ఎమ్‌సీజీ అదర్స్ సెగ్మెంట్‌లో 16.1 శాతం వృద్ధిని సాధించి.. త్రైమాసికంలో మొదటిసారిగా రూ.5,000 కోట్ల మార్కును అధిగమించినట్లు ఐటీసీ వెల్లడించింది. ప్రధానంగా స్టేపుల్స్, బిస్కెట్లు, నూడుల్స్, పానీయాలు, డైరీ, అగర్బత్తి, ప్రీమియం సబ్బులు వృద్ధిని పెంచటంలో దోహదపడ్డాయని కంపెనీ నివేదించింది. ఇదే క్రమంలో సిగరెట్‌ల విభాగం సంవత్సరానికి 10.9 శాతం అమ్మకాల పెరుగుదలను నమోదు చేసింది. అలాగే అగ్రి బిజినెస్ ఆదాయం 31 శాతం పెరిగింది.
ఇక ఐటీసీకి చెందిన హోటల్స్ వ్యాపారానికి వస్తే జూన్ త్రైమాసికం తమ హోటల్స్ వ్యాపారంలో అత్యుత్తమమైనదిగా కంపెనీ పేర్కొంది. అలాగే హోటల్స్ వ్యాపారాన్ని విడదీసి ప్రత్యేక సంస్థగా కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. రానున్న 15 నెలల కాలంలో కొత్త సంస్థ ఐపీవో రానున్నట్లు వెల్లడించింది. కొత్త కంపెనీలో షేర్ల అర్హత నిష్పత్తి 1:10గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications