నిర్మలా సీతారామన్ ఉద్దీపన, దేనికి ఎంతంటే?
కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రూ.6.29 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఉద్దీపన చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పర్యాటక, హెల్త్ రంగానికి ఈ ప్యాకేజీ ఊతం ఇస్తుందని చెబుతున్నారు. వ్యాపారాలకు ద్రవ్య కొరత ఉన్నందున, కేంద్రం చర్యలు భేష్ అంటున్నారు. కేంద్రం చర్యలు వినిమయ డిమాండ్, ప్రయివేటు పెట్టుబడులు, తయారీ రంగంలో పోటీతత్వం, ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తి పెంచడంతో పాటు ఆయా రంగాల బలోపేతానికి ఉపయోగపడుతుంది.

దేనికి ఎంత
ఈసీఎల్‌జీఎస్ పథకానికి రూ.1.50 లక్షల కోట్లు, కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ రూ.1.10 లక్షల కోట్లు, సంస్కరణల ఆధారిత విద్యుత్ పంపిణీకి రూ.97.631 కోట్లు, పీంజీకేవై కింద కింద నవంబర్ వరకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీకి రూ.93,869 కోట్లు, ఎగుమతిదారులకు బీమా కవరేజీ రూ.88,000 కోట్లు, ఎన్ఈఐఏ ద్వారా ప్రాజెక్టు ఎగుమతుల ప్రోత్సాహానికి రూ.33,000 కోట్లు ప్రతి గ్రామానికి బ్రాడ్ బాండ్ రూ.19,041 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.15 వేల కోట్లు, ఎంఎఫ్ఐలకు రుణ హామీ రూ.7500 కోట్లు, 5 లక్షల టూరిస్ట్‌లకు నెల ఉచిత వీసా రూ.100 కోట్లు, ఈశాన్య వ్యవసాయ మార్కెటింగ్, కార్పోరేషన్ పునరుద్ధరణ కోసం రూ.77 కోట్లు కేటాయించారు.

రుణ వితరణ
మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ.1.25 లక్షల రుణం అందేలా కేంద్రం షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు(MCLR) కంటే 2 శాతం ఎక్కువకు బ్యాంకుల నుండి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ.7,500 కోట్ల మేర రుణాలు పూర్తయ్యే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది.

రూ.100 కోట్ల భారం
అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే మొదటి ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసాను ఇవ్వనున్నారు. మార్చి 31, 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసాల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీం వర్తిస్తుంది. దీంతో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడుతుంది.


Click it and Unblock the Notifications