ప్రధాని నరేంద్ర మోడీ జీడీపీలో 10 శాతం రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీని మంగళవారం రాత్రి ప్రకటించారు. కేవలం ఆయన ప్రకటన చేశారు. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారనే అంశాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) సాయంత్రం 4 గంటలకు ప్రకటించనున్నారు. ఇది కేవలం ఆర్థిక ప్యాకేజీ కాదని, సంస్కరణ ఉద్దీపన అని ఆమె అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వివిధ కోణాల్లో బలం పెంచుకుందని పేర్కొన్నారు.

ఏయే రంగాలకు పెద్దపీట, ఎవరికి ఊరట
రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, నిర్మాణ రంగానికి, పర్యాటక రంగానికి, ఆటో పరిశ్రమకు, ఔషధ పరిశ్రమకు పెద్ద పీట వేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, నిర్మాణ రంగ కూలీలు, తాత్కాలిక ఉద్యోగులు, రైతులు తదితరులకు భారీ ఊరట కలిగించే అవకాశముంది.

ఎంఎస్ఎంఈలు
లాక్ డౌన్ కారణంగా ఎంఎస్ఎంఈలు కకలావికలమయ్యాయి. 6.5 కోట్ల ఎంఎంఎంఈలు ఉన్నాయి. మన దేశ జీడీపీలో దీని వాటా 29 శాతం. దేశీయ ఉత్పత్తుల్లో 48 శాతంగా ఉంటుంది. వీటి ద్వారా 11 కోట్ల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్యాకేజీలో వీటికి భారీ ఊరట కలిగే అవకాశముంది.

రియల్ ఎస్టేట్‌కు ఊతం
కరోనా-లాక్ డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ కూడా పతనమైంది. ఈ రంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాని పేర్కొన్న హౌసింగ్, భూమి, కార్మికులు, నగదు లభ్యత, చట్టాల గురించి రియల్ రంగానికి కూడా సంబంధం ఉందని, కాబట్టి ఈ ప్యాకేజీలో మంచి ప్రాధాన్యత ఉండి, రానున్న రోజుల్లో రియల్ రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ఆటో, ఔషధ రంగం
ఆటో ఇండస్ట్రీ కూడా దారుణంగా దెబ్బతిన్నది. గత నెలలో అయితే వివిధ కంపెనీలు జీరో సేల్స్ నమోదు చేశాయి. అదే సమయంలో డిమాండ్ పెరిగిన ఔషధ రంగానికి ప్రాధాన్యత ఉండవచ్చునని భావిస్తున్నారు.

ప్యాకేజీ ఎలా అందుతుంది.. ఆ దిశగా చర్యలు
ప్రధాన బ్యాంకుల నుండి మరిన్ని రుణాలు అందించే అవకాశముంది. అది కూడా స్వల్ప వడ్డీకే అందించవచ్చు. ఇప్పటికే తీసుకున్న రుణాల పునర్‌వ్యవస్థీకరణ, పన్ను మినహాయింపులు లభించవచ్చు. ఆర్బీఐ ద్వారా వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మారటోరియం పొడిగించవచ్చు. దివాలా చట్టం నిబంధనలకు కాస్త సడలింపు ఇచ్చే అవకాశముంది. ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి డిమాండ్ పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఆటో, ఎలక్ట్రానిక్ రంగాలకు ఊతమిచ్చేలా హోమ్ లోన్, వెహికిల్ లోన్ రుణాలపై వడ్డీ తగ్గింపు, బ్యాంకుల నుంచి సులభంగా మంజూరయ్యేలా ఉండవచ్చునని భావిస్తున్నారు. భూమి, కార్మిక చట్టాల్లో మార్పులు చేసి చౌకగా భూకేటాయింపులు ఉండవచ్చు.
కరోనా - లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో తమను ఆదుకోవాలని వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు రాష్ట్రాలు కూడా అంటున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాను పెంచాలని, ఆర్బీఐ నుండి మరిన్ని నిధులు ఇప్పించాలని చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications