Budget 2020: ఇవన్నీ కఠినమే... నిర్మలా సీతారామన్ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఫిబ్రవరి 1, శనివారం) ఉదయం గం.11కు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మందగమనం నేపథ్యంలో ఈ బడ్జెట్ దిశగా యావత్ భారతం చూస్తోంది. బడ్జెట్ ప్రకటనలు అందరికీ సానుకూలంగా ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. బడ్జెట్‌కు ముందు శుక్రవారం మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యహరించారు. కానీ బడ్జెట్ అంత కఠినంగా ఉండకపోవచ్చునని, సానుకూలంగా ఉండేందుకే అవకాశాలున్నాయనేది ఆర్థిక నిపుణుల మాట.

ఉద్యోగాల సృష్టి
నిరుద్యోగం పెరుగుతోంది. మందగమనం కారణంగా కొత్త నియామకాలు కంపెనీలు చేపట్టడం తగ్గించాయి. అందరినీ ఆందోళనకు గురి చేస్తోన్న అంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఉద్యోగాలను సృష్టించేందుకు చైనా ఫార్మాలాను అనుసరించాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అయితే ఉద్యోగ సృష్టికి మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరం. పెట్టుబడుల ప్రోత్సాం, బ్యాంకింగ్ రంగాలకు మార్గదర్శకాలు, ఎన్‌బీఎఫ్‌సీల బలోపేతం, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వంటి వివిధ చర్యల ద్వారా ఉద్యోగాలను సృష్టించవచ్చునని సూచిస్తున్నారు.

అత్యంత కఠిన బడ్జెట్
జీడీపీ ఆరేళ్ల స్థాయికి దిగజారింది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. ద్రవ్యోల్భణం ఆందోళనకరంగా ఉంది. వినియోగం, డిమాండ్ భారీగా పడిపోయింది. జీఎస్టీ కలెక్షన్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్‌కు ఇది అత్యంత కఠినమైన బడ్జెట్‌గా చెబుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఏం ప్రకటనలు చేస్తుంది.. వాటి అమలు ఎలా ఉంటుందనేది చూడాలి.

ఆర్థిక వృద్ధి ప్రకటనలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే జీడీపీని చూస్తే ఆ పరిస్థితిని కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం కలను చేరుకోవాలంటే ఆర్థిక వృద్ధి ప్రకటనలు తప్పనిసరి. కాబట్టి ఈ బడ్జెట్లో ఇవి ఉంటాయని భావిస్తున్నారు.

డిమాండ్ పెంచేలా..
పడిపోయిన వినియోగం, డిమాండ్‌కు పునరుత్తేజం కలిగించేలా నిర్మలమ్మ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ద్రవ్యలోటుకు అడ్డుకట్ట వేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం తీసుకు రావడం, పారిశ్రామిక రంగానికి ఊతం, పన్నుల రాబడులను సుస్థిరం చేయడం వంటి అంశాలు ఉన్నాయి.

గ్రామీణ వ్యవస్తపై దృష్టి..
ముఖ్యంగా గ్రామీణ భారతంపై మరింత దృష్టి సారించే అవకాశముంది. సరసమైన ధరల్లో గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం, నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పించడం వంటి చర్యలు ఉండవచ్చునని అంటున్నారు.

నిధులు పంచవచ్చు
ద్రవ్యలోటు కారణంగా ఖర్చులో కోతలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం పెంచవచ్చునని చెబుతున్నారు. గ్రామీణ రంగంలో ఉత్తేజం, ఉద్యోగ హామీలు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి వాటికి నిధులు పెంచవచ్చునని చెబుతున్నారు. విస్తృత ఆర్థిక లోటు తీర్చేందుకు ప్రభుత్వం రుణాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. అదనపు ఆదాయం కోసం కేంద్రం ఆర్బీఐ వైపు చూస్తోంది.


Click it and Unblock the Notifications