బ్యాంకర్లతో నిర్మలమ్మ కీలక భేటీ ముహూర్తం ఫిక్స్: నిర్ణయాలపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇదివరకు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న తరువాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. అదే తరహాలో ఈ సారి అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఆమె భేటీ కానున్నారు. దీనికి ముహూర్తం కూడా కుదిరింది. ఇప్పటికే బ్యాంకుల విలీనం వంటి నిర్ణయాలు నిర్మల సీతారామన్ నుంచి వెలువడ్డాయి. ఈ సారి ఇంకెలాంటి నిర్ణయాలు ఉంటాయనే ఉత్కంఠత నెలకొంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తరువాత నిర్మల సీతారామన్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతోన్న బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ఈ నెల 25వ తేదీన ముంబైలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాల గురించి నిర్మలమ్మ సమీక్షిస్తారు.
రుణాల వసూళ్లు, చెల్లింపులపైనా దృష్టి సారిస్తారు. నిరర్ధక ఆస్తుల నిల్వల గురించి ఆరా తీస్తారు. ఆయా అంశాలన్నింటిపైనా సమగ్ర నివేదికను సేకరిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లతో నిర్మల సీతారామన్ సమావేశం కానుండటం గత ఏడది మార్చి తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది మార్చి తరువాత ఆమె మళ్లీ బ్యాంకర్లతో భేటీ కాలేదు. నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పైనా ఆర్థికమంత్రి చర్చిస్తారని తెలుస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంకులు తమ లావాదేవీలను మరింత విస్తృతం చేసుకోగలిగాయి.. డిపాజిట్లను పెంచుకోలిగాయి. అంచనాలకు మించి రుణాలను చెల్లింపులు, వసూళ్లు నమోదు చేశాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో దీని విలువ 58,700 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు అగ్రిగేట్ రికార్డెడ్ ప్రాఫిట్ 31,815 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత అయిదేళ్ల ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం.
కరోనా వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎత్తుపల్లాలను చవి చూస్తోన్నప్పటికీ.. బ్యాంకింగ్ సెక్టార్ చెక్కు చెదరలేదనే విషయాన్ని ఇవి రుజువు చేస్తోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య నిర్మల సీతారామన్ ఆయా బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం కాబోతోండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సమావేశం సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందనే అంచనాలు నెలకొని ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్‌కు మరింత ఊతం ఇచ్చేలా ఉంటాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications