GST News: GST పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌పై నిర్మలమ్మ హాట్ కామెంట్స్.. కౌన్సిల్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
Petrol, Diesel under GST: దేశంలోని రాష్ట్రాలు వివిధ పేర్లతో పన్నులు వసూలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో గతంలో కేంద్రం GSTని పరిచయం చేసింది. ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో దీన్ని తీసుకొచ్చింది. దాదాపు అన్ని ఉత్పత్తులు మరియు సేవలను ఇందులో భాగం అయ్యేట్లు ప్రణాళిక రచించింది. అయితే ప్రజలు కోరుకున్న కొన్నింటిని మాత్రం GST నుంచి మినహాయింపు ఇచ్చి షాక్ ఇచ్చింది.
వివిధ వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విధంగా వస్తు, సేవల పన్ను (GST) పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను చేర్చాలని కేంద్రం ఇప్పుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీసుకొచ్చిన GST ఉద్దేశమే పెట్రోల్ మరియు డీజిల్‌ను దాని పరిధిలోనికి తీసుకురావాలి అని ఆమె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

పెట్రోల్ మరియు డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలు కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని నిర్మలమ్మ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉందన్నారు. తాము కూడా పెట్రోల్ మరియు డీజిల్ GSTలోకి చేర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామన్నారు.
తాజాగా జరిగిన 53వ GST కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న మరియు మధ్యస్థ పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. కార్టన్ బాక్సులపై GSTని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. వివిధ న్యాయస్థానాల్లో అప్పీళ్లకు ద్రవ్య పరిమితిని సెట్ చేశారు. రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు మరియు రిటైరింగ్ రూమ్‌ల సేవలు GST నుంచి మినహాయించబడ్డాయి. విద్యా సంస్థల వెలుపల 20 వేల లోపు హాస్టల్ ఫీజలపై GST ఎత్తివేశారు.


Click it and Unblock the Notifications