నిరుద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. ఈ విభాగాల్లో లక్ష మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ
Flipkart: ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగులను తొలగించడమే తప్ప కొత్త వారిని తీసుకుంటున్న దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేదు. అందువల్ల నిరుద్యోగిత పెరిగిపోతూ.. ఏ చిన్న కొలువు దొరికినా చేసేందుకు ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ప్రముఖ దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది.
దేశవ్యాప్తంగా త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో 'బిగ్ బిలియన్ డేస్' సహా పలు ఆఫర్ సేల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇందుకోసం పెద్దమొత్తంలో సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. దీనిని అధిగమించేందుకు భారీగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించాలని ఫ్లిప్‌కార్ట్ చూస్తోంది.

సీజనల్ ఉద్యోగాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. స్థానికంగా పనిచేసే డెలివరీ భాగస్వాములను ఎక్కువగా తీసుకోవాలని చూస్తోంది. మహిళలతో పాటు వికలాంగులు కూడా ఈ డ్రైవ్ లో ఉపాధి పొందుతారని.. తద్వారా వారిలోని ప్రతిభను సైతం సరఫరా గొలుసులో ఉపయోగించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ కు చెందిన ఫుల్‌ఫెల్‌మెంట్ సెంటర్‌లు, సార్టేషన్ సెంటర్‌లు మరియు డెలివరీ హబ్‌లలో ఈ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించనుంది. బిగ్ బిలియన్ డేస్ ద్వారా మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్లు ఇ-కామర్స్ సేవలను చాలా తేలికగా పొందగలిగినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ తెలిపారు. వారికి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని తాజా రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications