నవంబర్‌లో రెండో సంస్థను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్
వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) స్టార్టప్ స్కాపిక్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు విషయాన్ని వెల్లడించిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం, డీల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. స్కాపిక్ క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తుంది. ఏఆర్, 3డీ కంటెంటును పబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కామర్స్, మార్కెటింగ్ సంస్థలకు సేవలు అందిస్తోంది. కస్టమర్లకు షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు దీనిని అక్వైర్ చేసింది.
తాము రిటైల్ ఎకోసిస్టంను అభివృద్ధి చేసే అంశాలపై ఇన్వెస్ట్ చేశామని, తమ కస్టమర్లు సులభంగా అవసరమైనవి పొందేలా కంటెంటు, ఎక్స్‌పీరియన్స్ ద్వారా ప్రయత్నిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ డీల్ ద్వారా ఫ్లిప్‌కార్టు వంద శాతం వాటాలను పొందనుంది. అనంతరం బోర్డులోకి ప్రతిభావంతులైన డిజైనర్లు, డెవలపర్లకు అవకాశం ఇస్తారు.

వర్చువల్ స్టోర్స్, బ్రాండ్ అడ్వర్టయిజింగ్, కెమెరా ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్కాపిక్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. 5,00,000 డాలర్ల ఫండ్‌ను ఆక్సిలర్, స్పెషల్ ఇన్వెస్ట్, న్యూఫోర్ట్ క్యాపిటల్ నుండి సమీకరించింది. నవంబర్ నెలలో ఫ్లిప్‌కార్టుకు ఇది రెండో కొనుగోలు. ఈ నెల ప్రారంభంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గేమింగ్ స్టార్టప్ మెక్ మోచాను కొనుగోలు చేసింది. 2019లో లాయాల్టీ, రివార్డు ప్లాట్‌ఫాం ఈజీ రివార్డ్జ్‌లో 20 శాతం వాటాను దక్కించుకుంది.


Click it and Unblock the Notifications