e commerce: భారతీయులకు నమ్మకమైన సంస్థగా ఫ్లిప్‌కార్ట్ ఏళ్ల తరబడి సేవలందిస్తోంది. మొదటగా ఉచిత రిటర్న్స్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఈ ఇ-కామర్స్ సంస్థ.. మెల్లగా కస్టమర్లను ఆకర్షించింది. ఇల్లు కదలకుండా అరచేతిలోనే కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసే సౌలభ్యం కల్పించింది. క్రమేపీ రిటర్న్ స్థానంలో రిప్లేస్‌మెంట్ ప్రవేశపెట్టింది. తదనంతరం దాన్ని కూడా తీసేసి సర్వీస్ సెంటర్‌కు వెళ్లవలసినదిగా సూచిస్తోంది. ఇలా కాలం మారుతున్న కొద్దీ యూజర్ల ఆర్డర్‌పై తాము బాధ్యత తీసుకోవడం మానేసింది.
తాజాగా తన ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగదారులపై అదనపు చార్జీల భారం మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తన అనుబంధ క్విక్ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ లో ఫ్లాట్‌ఫారమ్ ఛార్జీలను కలెక్ట్ చేస్తోంది. ఇప్పుడు అదే విధానాన్ని తన ఇ-కామర్స్ బిజినెస్ లోనూ ప్రవేశపెట్టనుంది. మినిట్స్ లో రూ.5 వసూలు చేస్తుండగా తన మెయిన్ ఇ-కామర్స్ సైట్‌కుగాను రూ.3 ఛార్జ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్లాట్‌ఫారమ్ ఛార్జీల విషయంలో క్విక్ కామర్స్ విభాగంలోని స్విగ్గీ ఇన్స్టామార్ట్, జొమాటో బ్లింక్ఇట్, జెప్టోల బాటలో కొత్తగా ఫ్లిప్‌కార్ట్ చేరింది. అయితే గ్రోసరీ మరియు తన ట్రావెల్ విభాగం క్లియర్ ట్రిప్ లపై ఈ ఛార్జీలు వడ్డించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ దాని ఫ్యాషన్ సైట్ మింత్రాలో ఎప్పటి నుంచో ప్లాట్ ఫారమ్ రుసుము రోల్ ఆఫ్ చేసింది. కేవలం అక్కడితో ఆగకుండా వస్త్రాల రిటర్న్స్ పై అదనంగా రూ.50 ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తోంది.
కొన్ని సెలెక్టెడ్ పిన్ కోడ్స్‌లో మాత్రమే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవలు అందిస్తోంది. దీనికి ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు ఫిక్స్ చేసే క్రమంలో తన మెయిన్ ఇ-కామర్స్‌కు కూడా దీన్ని వర్తింపజేయాలని భావించింది. అయితే ఇదే రంగంలోని దాని ప్రత్యర్థులు అమెజాన్, మీషో వంటివి మాత్రం ఈ తరహా ప్లాట్‌ఫారమ్ మరియు హ్యాండ్లింగ్ రుసుమును వసూలు చేయడం లేదు. Q2లో రెండంకెల టాప్‌లైన్ వృద్ధిని నమోదు చేసిన తర్వాత దీన్ని ఈ ఛార్జీలు ప్రవేశపెట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications