విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త వినిపించింది. కేవలం మూడు వారాల క్రితం ప్రయాణికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక కీలక నిబంధనను ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు (In abeyance) ప్రభుత్వం ప్రకటించింది.

అసలు ఆ రూల్ ఏమిటి?
సాధారణంగా మనం ఫ్లైట్ టికెట్స్ (Flight tickets) బుక్ చేసుకున్నప్పుడు, వెబ్ చెక్-ఇన్ సమయంలో నచ్చిన సీటును ఎంచుకోవాలంటే విమానయాన సంస్థలు అదనపు బాదుడు మొదలుపెడతాయి. కిటికీ పక్కన సీటు కావాలన్నా లేదా ముందు వరుసలో కూర్చోవాలన్నా భారీగా వసూలు చేస్తాయి. ప్రస్తుతం కేవలం 5 నుంచి 15 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి. దీనిని అరికట్టడానికి, ప్రతి విమానంలో 60 శాతం సీట్లను ఉచితంగా (No seat-selection fee) కేటాయించాలని మార్చి 17న ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గుతుందని అందరూ భావించారు.
వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?
ఈ నిబంధనను విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ఉన్న 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్' (FIA) , ఆకాశ ఎయిర్ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. సీట్ సెలెక్షన్ ఫీజును రద్దు చేస్తే, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బేస్ ఫ్లైట్ టికెట్ (Flight tickets) ధరలను పెంచాల్సి వస్తుందని వారు వాదించారు. విమాన ఇంధన ధరలు (ATF) పెరగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల విమాన రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి నిర్ణయాలు మరింత భారం వేస్తాయని వారు వివరించారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది.
ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశాలు
అయితే, 60 శాతం ఉచిత సీట్ల నిబంధనను రద్దు చేసినప్పటికీ, మార్చి 17 నాటి సర్క్యులర్‌లోని ఇతర అంశాలను మాత్రం ప్రభుత్వం కొనసాగిస్తోంది.
- కలిసి ప్రయాణించే వారికి ప్రాధాన్యత: ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు వీలైనంత వరకు పక్కపక్క సీట్లు కేటాయించాలని ఆదేశించింది.
- పారదర్శకత: క్రీడా సామాగ్రి, సంగీత పరికరాలు , పెంపుడు జంతువులను తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన పాలసీలు ఉండాలని స్పష్టం చేసింది.
- ఛార్జీల వెల్లడి: సీట్ల కోసం వసూలు చేసే అదనపు ఛార్జీల వివరాలను బుకింగ్ సమయంలోనే స్పష్టంగా చూపాలని డిజిసిఎ (DGCA) ను కోరింది.
మొత్తానికి విమాన ప్రయాణం చౌకగా మారుతుందని ఆశించిన సామాన్యులకు ఈ నిర్ణయం నిరాశ కలిగించే విషయమే. అయితే విమాన సంస్థల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications