దేశీయ విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. పీక్ సీజన్‌లో 7,154 దేశీయ విమాన సర్వీసులు తగ్గింపు..
Flight Cuts Hit Peak Travel Season: పండుగలు, వివాహాలు, సంవత్సరాంతపు సెలవుల సీజన్ నేపథ్యంలో దేశీయ విమాన ప్రయాణికులకు కీలక సమాచారం వెలువడింది. 2025లోని నవంబర్-డిసెంబర్ నెలలతో పోలిస్తే, 2026 నవంబర్, డిసెంబర్ నెలలకు భారతీయ విమానయాన సంస్థలు మొత్తం 7,154 దేశీయ విమాన సర్వీసులను తక్కువగా షెడ్యూల్ చేశాయి.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదిక ప్రకారం.. ఇది వార్షిక ప్రాతిపదికన 3.5 శాతం క్షీణత.. అంటే దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 117 విమాన సర్వీసులు తగ్గాయి. 2022 తర్వాత నవంబర్-డిసెంబర్ పీక్ సీజన్‌లో వార్షిక ప్రాతిపదికన విమానాల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరగడం, ప్రయాణీకుల డిమాండ్‌లో మందగమనం ఈ కోతలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

విమానయాన సంస్థల వారీగా పరిశీలిస్తే.. స్పైస్‌జెట్ (SpiceJet) అత్యధిక శాతంలో కోత విధించి తన షెడ్యూల్‌ను 25.3 శాతం తగ్గించుకుని 6,357 విమానాలకు పరిమితమైంది. ఇక ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తంగా 11.4 శాతం కోత విధించింది; ఇందులో ఎయిర్ ఇండియా గత ఏడాదితో పోలిస్తే 15.9 శాతం తక్కువగా 27,090 విమానాలను, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 5.2 శాతం తగ్గింపుతో 22,080 విమానాలను షెడ్యూల్ చేశాయి.
మార్కెట్ లీడర్ ఇండిగో (IndiGo) సైతం 2025తో పోలిస్తే 1.7 శాతం తక్కువగా 1,19,425 విమానాలను సిద్ధం చేసింది. ఈ కోతల పరంపరకు అకాసా ఎయిర్ (Akasa Air) ఒక్కటే మినహాయింపుగా నిలిచింది. అకాసా తన షెడ్యూల్‌ను ఏకంగా 46.9 శాతం విస్తరించి 12,061 విమానాలకు పెంచడం ద్వారా ఈ సీజన్‌లో సర్వీసులను పెంచుతున్న ఏకైక ప్రధాన విమానయాన సంస్థగా నిలిచింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) గణాంకాల ప్రకారం.. ఆగస్టు 2026లో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 2.5 శాతం తగ్గగా, సెప్టెంబర్ 2026లో 118.2 లక్షలకు పరిమితమై (సెప్టెంబర్ 2025లోని 126.4 లక్షలతో పోలిస్తే 6.5 శాతం క్షీణత) విస్తృత మందగమనాన్ని సూచించింది.
అయితే, విమాన సర్వీసుల సంఖ్య తగ్గినప్పటికీ.. మొత్తం సీట్ల సామర్థ్యంలో (Seat Capacity) పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. విమానయాన సంస్థలు చిన్న విమానాల స్థానంలో పెద్ద విమానాలను (Larger Aircraft) ప్రవేశపెట్టడం, రద్దీగా ఉండే మార్గాలపై దృష్టి సారించడం వల్ల ఈ రెండు నెలల్లో మొత్తం 3.551 కోట్ల (35.51 మిలియన్) దేశీయ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇది 2025తో పోలిస్తే కేవలం 0.5 శాతం మాత్రమే తక్కువ. ముఖ్యంగా ఇండిగో తక్కువ విమానాలను నడుపుతున్నప్పటికీ.. దాని సీట్ల సామర్థ్యం వాస్తవానికి 1.4 శాతం పెరిగింది. దీనికి భిన్నంగా ఎయిర్ ఇండియా తన సీట్ల సామర్థ్యాన్ని 15 శాతం, స్పైస్‌జెట్ 19.9 శాతం మేర తగ్గించుకున్నాయి.
ప్రయాణీకుల కోణంలో చూస్తే.. సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ సమయాల ఎంపిక (Timing Options) తగ్గడం ప్రధాన ఆందోళనగా మారింది. విమాన సర్వీసులు తగ్గిన కారణంగా, ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల వారాలలో టికెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద విమానాలు నడిచే ప్రధాన మెట్రో మార్గాలపై దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ఒకటి లేదా రెండు విమానయాన సంస్థలు మాత్రమే పరిమిత సర్వీసులు నడిపే ప్రాంతీయ మార్గాలపై (Regional Routes) ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి సంవత్సరాంతానికి ముందు ప్రయాణించాలనుకునే వారు చివరి నిమిషపు ఆఫర్ల కోసం వేచి చూడకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణ తేదీలలో కొంత వెసులుబాటు ఉంచుకోవడం, నేరుగా వెళ్లే విమానాలు లేనప్పుడు సమీప విమానాశ్రయాలు లేదా కనెక్టింగ్ ఫ్లైట్లను పరిశీలించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే షెడ్యూల్ మార్పులు లేదా విమానాల విలీనం జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణీకులు తమ బుకింగ్ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి.


Click it and Unblock the Notifications
