Fitch Ratings: మోదీ ప్రధానిగా మూడోమారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ సంస్థలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత ఆర్థికంపై తమ సానుకూలతను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అందరి చూపు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పడింది.
ఫిచ్ రేటింగ్స్ తాజాగా భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వృద్ధి రేటు అంచనాను 7.2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఫిచ్ రేటింగ్స్ దీనిని 7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల వ్యయంలో మెరుగుదల, పెట్టుబడుల పెరుగుదల కారణంగా రేటింగ్ ఏజెన్సీ అంచనాలను సవరించింది. అలాగే ఫిచ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 6.2 శాతం వద్ద ప్రస్తుతం కొనసాగిస్తోంది.

ఫిచ్ తన గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం "2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం బలమైన రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాము" అని వెల్లడించింది. గ్రామీణ డిమాండ్‌లో మెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన తర్వాత ఫిచ్ రేటింగ్ పెంపు వచ్చింది.
2024 చివరి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గుతుందని, 2025 & 2026లో సగటున 4.3 శాతానికి తగ్గుతుందని ఫిచ్ అంచనా వేసింది. ఆర్‌బీఐ ఈ ఏడాది పాలసీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించనుంది. పెట్టుబడి పెరుగుతూనే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఇటీవలి త్రైమాసికాల కంటే వృద్ధి నెమ్మదిగా ఉంటుందని అంచనా వేసింది. అలాగే వినియోగదారుల విశ్వాసం పెరిగేకొద్దీ వినియోగదారుల వ్యయం మెరుగుపడుతుందని వెల్లడించింది. దేశంలో ఈసారి సాధారణ రుతుపవనాల సంకేతాలు వృద్ధిని పెంచుతాయని, ద్రవ్యోల్బణం తక్కువ అస్థిరతను కలిగిస్తుందని పేర్కొంది. అయితే ఇటీవలి విపరీతమైన వేడి కారణంగా ప్రమాదం ఏర్పడింది.


Click it and Unblock the Notifications