US Rating Downgrade: ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చైనా తర్వాత యూఎస్ పరిస్థితి సన్నగిల్లిందని రేటింగ్ ఏజెన్సీ చర్యలు హెచ్చరిస్తున్నాయి. ఇది నిజంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చెడ్డ వార్తని చెప్పుకోవాలి.
ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో యూఎస్ ఆర్థిక, రుణాల పరిస్థితి మరింత దిగజారిందని ఏజెన్సీ పేర్కొంది. 2011 తర్వాత అమెరికా క్రెడిట్ రేటింగ్ పడిపోవటం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఫిచ్ అమెరికా రేటింగ్‌ను AAA నుంచి AA+కి తగ్గించింది. పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా తాజా తగ్గింపు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా అప్పులు జీడీపీలో 98 శాతంగా ఉన్నాయి.

గత 20 ఏళ్లలో అమెరికాలో పాలనా స్థితి మరింత దిగజారిందని ఫిచ్ పేర్కొంది. ఫిచ్ అనేది దేశాలు లేదా కంపెనీల క్రెడిట్ యోగ్యతను అంచనా వేసే ప్రపంచంలోని మూడు ప్రధాన స్వతంత్ర ఏజెన్సీల్లో ఒకటి. అయితే US ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ దీనిని ఏజెన్సీ తాజా చర్యను ఏకపక్షమైనదిగా పేర్కొన్నారు. 2018-2020 మధ్య కాలానికి సంబంధించిన పాత డేటా ఆధారంగా ఏజెన్సీ ఈ రేటింగ్‌ను ఇచ్చిందని ఆయన అన్నారు. రానున్న కాలంలో రేటింగ్ మరింతగా దిగజారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు క్రెడిట్ రేటింగ్‌లను ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవటానికి బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు. కంపెనీ లేదా ప్రభుత్వ సాధనాల్లో డబ్బు పెట్టుబడి పెట్టడంలో ఎంత రిస్క్ ఉంటుందో ఇది చూపిస్తుంది. US ప్రభుత్వ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.. ఎందుకంటే దాని ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది. ఇతర దేశాల కంటే స్థిరంగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న రుణంపై భారీ రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. జూన్‌లో అమెరికా ప్రభుత్వం రుణ పరిమితిని $31.4 ట్రిలియన్లకు పెంచింది. దీనికి ముందు అమెరికా డిఫాల్డ్ దగ్గరదాకా వెళ్లింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారితే అది పరోక్షంగా ప్రపంచ దేశాల ఆర్థికాలను దెబ్బతీస్తుంది. ఫిచ్ రేటింగ్ వెలువడిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు సైతం భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.


Click it and Unblock the Notifications