ITR Filing: రికార్డు స్థాయిలో పన్ను ఫైలింగ్స్ నమోదు.. వార్నింగ్ ఇచ్చిన టాక్స్ అధికారులు..!
Tax Filing: దేశ ప్రగతికి పన్ను చెల్లింపుదారుల సహకారం అత్యంత ముఖ్యమైనదని తెలిసిందే. అయితే గత ఏడాదితో పోల్చితే అత్యధికంగా పన్ను ఫైలింగ్స్ పెరిగినట్లు ఆదాయపుపన్ను శాఖ ప్రకటించింది.
2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను Xలో పోస్ట్ చేశారు. ఇదే క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ ఐటీఆర్‌లను దాఖలు చేయడానికి జూలై 31 గడువును కోల్పోయిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. లేట్ రిటర్న్ లేదా సవరించిన ఐటీఆర్ దాఖలుకు డిసెంబర్ 31 చివరి అవకాశంగా పేర్కొంది.

ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్ అనేది ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(1) నిర్దేశించిన గడువు తేదీ తర్వాత దాఖలు చేయబడిన పన్ను రిటర్న్‌ను సూచిస్తుంది. ఈ చట్టం ప్రకారం అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌ను జూలైలో లేదా అంతకంటే ముందు దాఖలు చేయాలి. సకాలంలో ఫైలింగ్ విఫలమైతే పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) కింద ఆలస్యమైన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి వారికి అనుమతి ఉంది. ఇది ఆలస్య రుసుము, వడ్డీ చెల్లింపుకు లోబడి ఉంటుంది.
లేటుకు ఫైన్ రేట్లు ఇవే..
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139(4) కింద ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. అలాగే ఇదే చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు సెక్షన్ 234ఎఫ్ కింద రూ.5,000 జరిమానా విధించబడుతుంది.
అలాగే మెుత్తం ఏడాదికి ఆదాయం రూ.5 లక్షలకు మించని వ్యక్తులకు ఆలస్యంగా దాఖలు చేస్తే గరిష్టంగా రూ.1,000 జరిమానా విధించబడుతుంది. అదనంగా పన్ను బకాయి ఉన్నట్లయితే.. గడువు తేదీ తర్వాత ITR దాఖలు చేసే వరకు నెలకు 1 శాతం వడ్డీ వసూలు చేయబడుతుందని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications