Ola: మరోసారి ఓలా స్కూటర్లో మంటలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ.. ఇవీ కారణాలు!!
Ola: కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు కేంద్రం కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. పెట్రోల్, డీజిల్ కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. అయితే తరచూ జరుగుతున్న కొన్ని సంఘటనలు సర్కారు ఆలోచనలకు బ్రేక్స్ వేస్తున్నాయి.
పూణేలోని పింప్రి-చించ్‌వాడ్‌లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. కళాశాల ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న సమయంలో ఓలా ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. వీటిని అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. భారీ పొగలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై స్కూటీ మేకర్ ఓలా యాజమాన్యం స్పందించింది. అనధీకృత పార్ట్ ను వాహనానికి వినియోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు నిర్ధారించింది. ఒరిజినల్ భాగాల వినియోగానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ సంఘటన నొక్కిచెప్పినట్లు స్పష్టం చేసింది. వాహనం బ్యాటరీ చెక్కుచెదరకుండా వర్కింగ్ కండీషన్ లో ఉందని ధ్రువీకరించింది. కస్టమర్ సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది.
'మేము కఠినమైన సేఫ్టీ ప్రమాణాలు అనుసరిస్తూ.. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. కేవలం జెన్యూన్ పార్ట్స్ మాత్రమే వినియోగించాలని కస్టమర్లను కోరుతున్నాము. విడి భాగాల కోసం ఆన్ లైన్ లేదా సమీపంలోని ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సంప్రదించవచ్చు' అని ఓలా ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 2022లోనూ పూణెలోని ధనోరి వద్ద ఓలా S1 ప్రో స్కూటర్‌లో ఇదే విధంగా మంటలు చెలరేగడం గమనార్హం.


Click it and Unblock the Notifications