Paytm Results: పేటీఎం ఇన్వెస్టర్లకు శుభవార్త.. మంచి కాలం అతిత్వరలోనే..
Paytm Q2 Results: దేశీయ డిజిటల్ పేమెంట్స్ రంగంలో పేటీఎం ప్రయాణం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఫిన్ టెక్ స్టార్టప్ ఈ రంగంలోని ఇతర సంస్థల కంటే వేగంగా వ్యాపారంలో దూసుకుపోతోంది.
అవును కంపెనీ తాజాగా తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇది ఇన్వెష్టర్లలో కొత్త ఆనందాన్ని నింపుతోంది. ప్రస్తుతం విజయశేఖర శర్మ కల నిజం కాబోతోంది. ఈ క్రమంలో కంపెనీ రెండవ త్రైమాసికంలో రూ.2,519 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలోని ఆదాయాల కంటే 32 శాతం అధికం. ప్రధానంగా కంపెనీ రుణ వ్యాపారం వేగంగా పుంజుకోవటమే ఈ వృద్ధికి కారణంగా తెలుస్తోంది.

ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే.. కంపెనీ నష్టాలు భారీగా తగ్గి రూ.292 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో పేటీఎం రూ.571 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం పండుగల సీజన్ వల్ల నమోదయ్యే ఆన్ లైన్ అమ్మకాలతో మూడో త్రైమాసికంలో కంపెనీ మంచి ఆదాయాలను నమోదు చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ మొత్తం రుణ వితరణ సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు 122 శాతం వృద్ధితో రూ.16,211 కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాది మెుదటి త్రైమాసికంలో కంపెనీ రూ.2,341 కోట్ల ఆదాయంతో రూ.358 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత కొన్ని త్రైమాసికాలుగా పేటీఎం పనితీరు మెరుగుపడుతూ నష్టాలను భారీగా తగ్గించుకుంటోంది. రానున్న కొన్ని త్రైమాసికాల్లో కంపెనీ లాభాలను నమోదు చేస్తుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో నోయిడాకు చెందిన కంపెనీ ESOP ఖర్చులు రూ.385 కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు సంవత్సరానికి 14 శాతం పెరిగి రూ.2,936 కోట్లుగా ఉన్నాయి. ఆదాయ మార్జిన్లు పెరగటంతో కంపెనీ పనితీరు ఊహించిన దాని కంటే మెరుగ్గా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications