Hyderabad: ఇతర నగరాలను వెనక్కు నెట్టిన ముంబై, హైదరాబాద్.. ఆర్థిక, సైబర్ నేరాల్లో ఇవే టాప్
financial frauds: సాంకేతికత విరివిగా అందుబాటులోకి వస్తున్న కొద్దీ, టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ఈ తరహా ఆర్థిక నేరాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రో సిటీల్లోని ప్రజలే టార్గెట్ గా అయా ముఠాలు పుట్టుకొస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫైనాన్షియల్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తెలిపింది. 2022లో మొత్తం 6 వేల 960 ఆర్థిక నేరాలతో ముంబై టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021లో 2 వేల 883 గా నమోదైన సైబర్ నేరాలు.. గతేడాది 4 వేల 724కి పెరిగినట్లు ప్రకటించింది.

ఇక ముంబై తర్వాత 2022లో అత్యధిక ఆర్థిక నేరాల కేసులు హైదరాబాదులో నమోదైనట్లు NCRB వెల్లడించింది. 6 వేల 15 కేసులతో భాగ్యనపురం రెండో స్థానంలో నిలవగా.. 5,007తో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉందని తెలిపింది. ముంబైలో నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో దాదాపు 5 వేలకు పైగా ఫోర్జరీ, చీటింగ్ వంటి విశ్వాస ఉల్లంఘనకు సంబంధించినవే అని నివేదిక స్పష్టం చేసింది.
సైబర్ నేరాల విషయానికొస్తే మహారాష్ట్ర నాలుగో స్థానానికి పరిమితం కాగా.. మన తెలుగు రాష్ట్రం తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ఆన్లైన్ సైబర్ క్రైమ్ విభాగంలోనే 15 వేల 297 కేసుల్లో FIRలు నమోదయ్యాయి. 12 వేల 556 కేసులతో కర్ణాటక, 10 వేల 117తో ఉత్తర ప్రదేశ్ తదనంతర స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications