Economy: దేశ ఎకానమీపై ఆర్థిక శాఖ కీలక నివేదిక.. మార్కెట్లకు మంచి బూస్ట్ రెడీ..
GDP News: కేంద్ర ఆర్థిక శాఖ మార్కెట్లకు మంచి బూస్ట్ ఇచ్చే వార్త చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి మంచి వృద్ధిని కనబరచవచ్చని నివేదించింది. FY25కి గాను పలు అంచనాలతో ముందుకు వచ్చింది. అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడగలిగే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో GDP 7 శాతం వృద్ధి రేటును కనబరచవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ బ్రైట్ స్పాట్‌గా వెలుగొందుతున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోని భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లు మరియు అస్థిరతలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రకటించింది. GDP 7 శాతానికి మించి పెరగడం ఇది వరుసగా మూడోసారి అని గుర్తుచేసింది. అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఇండియా వృద్ధి అంచనాలను మరింత మెరుగైన స్థానానికి సవరించాయని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సమీక్షను విడుదల చేసింది.
ఆరోగ్యకరమైన రబీ పంటలు, స్థిరమైన తయారీ లాభదాయకత మరియు సేవారంగ స్థితిస్థాపకత FY25లో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతునిస్తాయని నివేదిక పేర్కొంది. గృహ వినియోగం మెరుగుపడుతుందని అంచనా వేసింది. ప్రైవేట్ క్యాపెక్స్ పెరుగుదల, మెరుగైన వ్యాపార సెంటిమెంట్‌లు, బ్యాంకులు మరియు కార్పొరేట్‌ల బలమైన బ్యాలెన్స్ షీట్‌లు, మూలధన వ్యయంలో ప్రభుత్వం స్థిరమైన పెట్టుబడికి అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయంది.
ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఎల్ నినో తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు, సాధారణ రుతుపవనాల ఆశలు వెరసి ఖరీఫ్ సాధారణం కంటే మెరుగ్గా విత్తడానికి మంచి సూచన అని పేర్కొంది. FY24 Q3లో పట్టణ నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గిందని, ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రారంభమైనప్పటి నుండి అత్యల్పంగా ఉందని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications