Infosys Share: దేశీయ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ గతవారం తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో ఈక్విటీ పెట్టుబడిదారులకు డివిడెండ్ గురించి కీలక ప్రకటన చేసింది.
బెంగళూరు కేంద్రగా పనిచేస్తున్న రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) ఒక్కే షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని పొందాలనుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సింది ఎక్స్ డివిడెండ్ తేదీ గురించే. ఈరోజు అంటే అక్టోబర్ 25, 2023 ఇన్ఫోసిస్ షేర్లకు ఎక్స్ డివిడెండ్ తారీఖుగా కంపెనీ ప్రకటించింది. అంటే కంపెనీ బుక్స్ ప్రకారం ఈరోజు షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే డివిడెండ్ చెల్లించబడుతుందని గమనించాలి.

అంటే కంపెనీ పుస్తకాల్లో ఈరోజు షేర్లను కలిగి ఉంటేనే నవంబర్ 11న కంపెనీ చెల్లించే డివిడెండ్ పొందటానికి అర్హత ఉంటుంది. దీనికి ముందు ఏప్రిల్ మాసంలో షేర్ హోల్డర్లకు కంపెనీ రూ.17.50 ఫైనల్ డివిడెండ్ అందించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మెుత్తంగా ఒక్కో షేరుపై రూ.34 డివిడెండ్ రూపంలో చెల్లించింది. దీనికోసం కంపెనీ రూ.6,844.20 కోట్లను చెల్లించింది. ఈరోజు 12.40 గంటల సమయంలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 2.76 శాతం క్షీణించి రూ.1,369.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తమ వ్యాపారంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో కంపెనీ ఈ నెల ప్రారంభంలో FY24 కోసం తన ఆదాయ మార్గదర్శకత్వాన్ని తగ్గించుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అత్యధికంగా 7.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఆదాయాల మార్జిన్లు మెరుగుపడుతున్నట్లు కూడా ప్రకటించింది. అయితే మెుత్తానికి క్యూ2 ఐటీ కంపెనీల తాజా ఫలితాలతో మార్కెట్ ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు.


Click it and Unblock the Notifications