Payment system: కొత్త పేమెంట్ సిస్టమ్ లాంచ్.. నవ్వులు పూయించేందుకు రిలయన్స్‌తో ఫెడరల్ బ్యాంక్ డీల్
Smilepay: భారతీయ చెల్లింపుల వ్యవస్థలో గత పదేళ్లుగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూలో నిలబడే రోజుల నుంచి అరచేతిలో నడిరోడ్డుపై ఒకే క్లిక్కుతో పేమెంట్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ రంగంలో UPI ఎంట్రీ కీలక మార్పులకు నాంది పలికింది. కాగా పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇటీవల మరికొన్ని ఇతర చెల్లింపు వ్యవస్థలు సైతం అందుబాటులో వస్తున్నాయి.
ప్రైవేట్ రంగ రుణదాత ఫెడరల్ బ్యాంక్ 'స్మైల్ పే' పేరిట ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. వినూత్న సాంకేతికత ద్వారా కస్టమర్‌లు కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. దీంతో పేమెంట్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడంతో పాటు సులభంగా లావాదేవీలను పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. లావాదేవీల నిర్వహణకు BHIM ఆధార్ పే సాంకేతికతను ఉపయోగించుకుంటుంది.

ఈ సాంకేతికతను కస్టమర్లకు పరిచయం చేసేందుకు రిలయన్స్ రిటైల్ మరియు స్వాతంత్ర మైక్రో ఫైనాన్స్‌ల సహకారంతో బ్యాంక్ జతకట్టింది. ఎంపిక చేయబడిన శాఖలు మరియు అవుట్‌లెట్లలో స్మైల్‌పే ప్రారంభ రోల్‌అవుట్ నిర్వహించబడుతోంది. దేశ ఆర్థిక పరిణామంలో మైలురాయిగా నిలిచిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలినీ వారియర్ దీని లాంచ్‌ను ప్రకటించారు
స్మైల్ పే ద్వారా లావాదేవీల నిర్వహణకు నగదు, కార్డ్‌లతో పాటు మొబైల్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బిజీగా ఉండే దుకాణాలు, రిటైల్ స్టోర్ కౌంటర్ల వద్ద సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. సురక్షితమైన UIDAI ఫేస్ ఆథెంటికేషన్ సర్వీస్ ఆధారంగా విశ్వసనీయ లావాదేవీలను నిర్ధారిస్తుంది. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కొనుగోలు పూర్తి చేయొచ్చు.


Click it and Unblock the Notifications