Stock Market: గతవారం నుంచి చాలా మంది భారత ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచ మార్కెట్లు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయనే ఆందోళన మధ్య మార్కెట్లులో ఒడిదొడుకులు భారీగానే కనిపించాయి. ఈ తరుణంలో అమెరికన్ బిలియనీర్ల సంపద అమాంతం ఆవిరైంది.

జెరోమ్ పావెల్ ప్రసంగం..
US ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఎనిమిది నిమిషాల ప్రసంగం యూఎస్ స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసింది. ఈ కారణంగా అమెరికాలోని అత్యంత ధనవంతులు సుమారు 78 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారని ఫైనాన్షియల్ రివ్యూ తన నివేదికలో వెల్లడించింది.

వడ్డీ రేట్లపై ప్రకటన..
జాక్సన్ హోల్‌లోని కాన్సాస్ సిటీ ఫెడ్ వార్షిక పాలసీ ఫోరమ్‌లో పావెల్ శుక్రవారం ప్రసంగించారు. ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును మానుకుంటుందని అందరూ భావిస్తుండగా.. దూకుడు పెంచటంతో మార్కెట్లు కుప్పకూలాయి. US స్టాక్‌లు కోలుకుంటున్న నేపథ్యంలో పావెల్ ప్రసంగం రావటం వల్ల మార్కెట్లు మళ్లీ బేర్ మన్నాయి.

బిలియనీర్ల సంపద ఆవిరి..
ఫెడ్ ప్రసంగం ముగిసిన తర్వాత.. టెస్లా CEO, ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ 5.5 బిలియన్ డాలర్లను కోల్పోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపదలో 6.8 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ 2.2 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 2.7 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. మెుత్తం మీద సంపన్న అమెరికన్లు 112 బిలియన్ డాలర్లను ఒక్కరోజే కోల్పోయారు.

భారత మార్కెట్‌పై ప్రభావం..
ఈ వార్త భారతీయ స్టాక్‌ల ర్యాలీకి "తాత్కాలిక విరామం" ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ వరుసగా ఆరు వారాల లాభాల తర్వాత.. గతవారం కరెక్షన్‌ను ప్రారంభించింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ హాకిష్ ప్రసంగం తర్వాత US మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. అక్కడి మార్కెట్ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ కరెక్షన్ రాబోయే వారంలో కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మెుత్తానికి ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు చాలా ఒత్తిడిలో ట్రేడ్ అవుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గమనించాల్సిన విషయాలు..
అయితే ముఖ్యంగా భారత జీడీపీ గణాంకాలు, ఆగస్టు నెల ఆటో అమ్మకాల వివరాలు మన మార్కెట్లకు కీలకమైనవని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. వీటికి తోడు ముడి చమురు ధరలు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్‌లలో కదలికలపై కూడా మార్కెట్ దృష్టి ఉంటుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications