11వసారి రూ.1లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్ళు: ఏపీ-తెలంగాణలలో ఎంత పెరిగిందంటే?
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) వసూళ్లు ఈ ఏడాది వరుసగా రెండో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.05 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన మొత్తంతో పోలిస్తే 8 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో 2020 జనవరిలో వసూలైన రూ.1.10 లక్షల కోట్లతో పోలిస్తే ఫిబ్రవరిలో మాత్రం తగ్గాయి.

11వసారి లక్షకోట్లు దాటాయి
మొత్తంగా జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1,05,366 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిందని ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. జూలై 1, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి నెలసరి వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం ఇది 11వసారి. గత ఏడాది డిసెంబర్, నవంబర్ నెలల్లో కూడా జీఎస్టీ ఆదాయం రూ.1.03 లక్షల కోట్లుగా ఉంది. అంటే వరుసగా నాలుగోసారి రూ.లక్ష కోట్లు దాటాయి.

ఏది ఎంత?
ఫిబ్రవరి నెల జీఎస్టీ ఆదాయంలో సీజీఎస్టీ రూ.20,569 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ రూ.48,503 కోట్లు, సెస్ రూ.8,947 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 29 నాటికి జనవరికిగాను దాఖలైన మొత్తం జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ 83 లక్షలుగా నమోదయ్యాయి. రెగ్యులర్ సెటిల్మెంట్‌గా ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.22,586 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.16,553 కోట్లను కేంద్రం సెటిల్ చేసింది.

సీజీఎస్టీ.. ఎస్జీఎస్టీ..
రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయం సీజీఎస్టీగా రూ.43,155 కోట్లు, ఎస్జీఎస్టీగా రూ.43,901 కోట్లుగా ఉందని తన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో..
ఫిబ్రవరి జీఎస్టీ ఆదాయం గత ఏడాదితో ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం, తెలంగాణలో 6 శాతం పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్టీ రెవెన్యూ రూ.2008 కోట్లు కాగా, ఇప్పుడు రూ.2563 కోట్లు, తెలంగాణలో గత ఫిబ్రవరిలో రూ.3460 కోట్లు కాగా ఇప్పుడు రూ.3667 కోట్లు వసూలయ్యాయి.


Click it and Unblock the Notifications