VST Industries: స్టాక్ మార్కెట్లలో ఉండే చాలా మందికి రాధాకిషన్ దమానీ పేరు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే దివంగత దిగ్గజ ఇన్వెస్టర్ భారత బిగ్‌బుల్ రాఖేష్ జున్‌జున్‌వాలాకి దమానీ గురువు. పైగా దేశంలో డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్ల చైన్ నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు సైతం రాధాకిషన్ దమానీ పరిచయమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో భారతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ మార్కెట్‌లో కూడా వీఎస్‌టీ ఇండస్ట్రీస్ షేర్లు బుల్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగి రూ.3,816కి చేరుకున్నాయి. దీని వెనుక అసలు కారణం ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో మరిన్ని షేర్లను కొనుగోలు చేయటమే. దమానీ VST ఇండస్ట్రీస్ కంపెనీలో 2.33 లక్షల షేర్లను ఒక్కోటి రూ.3,689.96 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో కంపెనీలో 1.51% వాటాను కొత్తగా కొన్నారు.

ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ డిసెంబర్ 2023 త్రైమాసికంలో VST ఇండస్ట్రీస్‌లో 32.89% వాటాను కలిగి ఉన్నారు. తాజాగా దమానీ కంపెనీకి చెందిన 2.33 లక్షల షేర్లను రూ.86.25 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా కొనుగోలు తర్వాత కంపెనీలో దమానీ వాటా 34.4 శాతానికి పెరిగింది. దీనికి ముందు జనవరిలో దమానీ కంపెనీలో 1.44 శాతం వాటాను కొన్నారు. ప్రస్తుతం డీల్ పూర్తైన తర్వాత కంపెనీలో అతిపెద్ద వాటాదారునిగా దమానీ మారారు. ఎందుకంటే VST ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్ల వాటా 32.16% మాత్రమే కావటం గమనార్హం.
VST ఇండస్ట్రీస్ షేర్లు గత కొన్ని సంవత్సరాల్లో 1800% కంటే ఎక్కువ రాబడిని పెట్టుబడిదారులకు అందించింది. కంపెనీ షేర్లు 8 ఏప్రిల్ 2004న రూ.197.65 వద్ద ఉండగా.. 16 ఏప్రిల్ 2024న రూ.3,816కి చేరుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.4,328.45 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.3,159.90గా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌కు చెందిన 3.3 లక్షల షేర్లను విక్రయించింది. HDFC మ్యూచువల్ ఫండ్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో కంపెనీలో 5.84% వాటాను కలిగి ఉండగా.. ఇటీవల 2.15% వాటాను విక్రయించింది.


Click it and Unblock the Notifications