Agniveers: అగ్నివీర్ల పరిహారంపై కీలక అప్‌డేట్.. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు భారీ పరిహారం
Agniveers: సైనిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కొత్త నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్స్ పేరిట తక్కువ కాల వ్యవధితో యువతను రిక్రూట్ చేసుకోవాలని భావించింది. కాగా తాజాగా వారికి సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి కీలక అప్ డేట్ వెలువడింది.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నివీర్ల బంధువులకు ప్రభుత్వం భారీగా నగదు సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. వారు కోటి రూపాయలకు పైగా అందుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాన్-కంట్రిబ్యూటరీ బీమాగా 48 లక్షలు, ఎక్స్-గ్రేషియా కింద 44 లక్షలు తో పాటు సేవా నిధిలో 30 శాతం విరాళంగా పొందనున్నారు.

ఈ పారితోషికంలో అగ్నివీర్ మరణించిన తేదీ నుంచి 4 సంవత్సరాలు (13 లక్షలకు పైగా) పూర్తయ్యే వరకు మిగిలిన పదవీకాలానికి సంబంధించిన చెల్లింపు కూడా ఉంటుంది. సాయుధ దళాల యుద్ధ ప్రమాద నిధి నుంచి 8 లక్షల సహకారం సైతం వారు పొందనున్నారు. గవాటే అక్షయ్ లక్ష్మణ్ అనే అగ్నివీర్ సియాచిన్ వద్ద నిన్న ప్రాణాలు కోల్పోయిన అనంతరం ఈ సమాచారం వెలువడింది. ఆపరేషన్స్ లో ప్రాణాలు కోల్పోయిన మొదటి అగ్నివీర్ ఈయనే.
భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్.. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఆర్మీ సైతం అతడి బంధువులకు అండగా నిలుస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. "అగ్నివీర్ (ఆపరేటర్) గవాటే అక్షయ్ లక్ష్మణ్ అత్యున్నత త్యాగానికి వందనం" అని భారత సైన్యం తన అధికారిక X ఖాతాలో పేర్కొంది.


Click it and Unblock the Notifications