మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు.. RBI రిపోర్ట్‌లో సంచలన నిజాలు! ఆ ఒక్క నోటుతోనే తిప్పలు!
మీరు నిత్యం వ్యాపారాల కోసమో, అవసరాల కోసమో రూ. 500 నోట్లను ఎక్కువగా వాడుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశంలో దొంగ నోట్ల (Counterfeit Currency) చలామణి ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో (2024-25) పోలిస్తే.. 2025-26 లో భారత బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన నకిలీ నోట్ల సంఖ్య 5.7 శాతం పెరిగి 2,29,746 పీసులకు చేరుకుంది. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. మార్కెట్లో ఎక్కువగా చలామణిలో ఉండే రూ. 500 దొంగ నోట్లు ఏకంగా 20.5 శాతం పెరిగాయి.

కేటుగాళ్ల మెయిన్ టార్గెట్ రూ. 500 నోటే!
ఒకప్పుడు దొంగ నోట్ల ముఠాలు రూ. 2,000 నోట్లను టార్గెట్ చేసేవి. కానీ ఆర్‌బీఐ ఆ నోట్లను చలామణి నుండి వెనక్కి తీసుకోవడంతో, ఇప్పుడు కేటుగాళ్ల చూపు పూర్తిగా రూ. 500 నోటుపై పడింది.
- FY24 లో: మొత్తం దొరికిన నకిలీ నోట్లలో రూ. 500 నోట్ల వాటా 38.5% మాత్రమే.
- FY25 లో: ఇది 54.2 శాతానికి పెరిగింది.
- FY26 లో: ఇప్పుడు ఏకంగా 61.8 శాతానికి చేరింది! అంటే బ్యాంకుల్లో దొరుకుతున్న ప్రతి 10 నకిలీ నోట్లలో 6 నోట్లు రూ. 500 వే ఉంటున్నాయి.
చిన్న నోట్లలో చూస్తే రూ. 20 నకిలీ నోట్లు కూడా 47.4% పెరిగాయి (కానీ వీటి సంఖ్య కేవలం 373 మాత్రమే). మరోవైపు రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నకిలీ నోట్ల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గింది.
రూ. 2,000 దొంగ నోట్ల కథ ముగిసింది!
రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 నోట్లను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడంతో, వాటి నకిలీ నోట్ల గుర్తింపు కూడా దాదాపు పడిపోయింది. FY24 లో 26,035 గా ఉన్న రూ. 2,000 దొంగ నోట్ల సంఖ్య, FY26 నాటికి కేవలం 824 పీసులకు పడిపోయింది (76.5% తగ్గుదల).
ఆర్‌బీఐ దాకా వెళ్లకుండానే బ్యాంకుల్లోనే బలి!
ఈ డేటాలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపించింది. ఒకప్పుడు దొంగ నోట్లు చాలా వరకు కమర్షియల్ బ్యాంకులు దాటుకుని మెయిన్ బ్రాంచ్ అయిన ఆర్‌బీఐ దాకా వెళ్లేవి. కానీ ఈసారి ఆర్‌బీఐ వద్ద పట్టుబడిన నోట్లు కేవలం 2.4% (5,412 పీసులు) మాత్రమే. మిగిలిన 97.6% (2,24,334 పీసులు) నకిలీ నోట్లను కమర్షియల్ బ్యాంకులే (SBI, HDFC, ICICI లాంటివి) ముందే పసిగట్టి నొక్కేసాయి. దీన్ని బట్టి మన బ్యాంకుల్లోని ఫ్రంట్‌లైన్ సిబ్బంది , క్యాష్ కౌంటింగ్ మెషిన్ల టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిందని అర్థం చేసుకోవచ్చు.
రూ. 500 నోట్లకే ఎందుకు ఇంత గిరాకీ?
మార్కెట్లో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో (Value) రూ. 500 నోట్ల వాటానే ఏకంగా 85.5% ఉంది. వాల్యూమ్ (సంఖ్య) పరంగా చూసినా 41.2% ఇవే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 705.48 కోట్ల రూ. 500 నోట్లు చలామణిలో ఉన్నాయి. జనాలు ఎక్కువగా ఈ నోట్లనే వాడుతుంటారు కాబట్టి, కేటుగాళ్లు కొద్దిగా టెక్నాలజీ మార్చినా సామాన్యులు గుర్తుపట్టలేక సులభంగా మోసపోతున్నారు.
కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో 'ఉత్కర్ష్ 2029' ప్లాన్!
దొంగ నోట్ల ముఠాలకు గట్టి చెక్ పెట్టేందుకు RBI సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తన కరెన్సీ మేనేజ్‌మెంట్ ఎజెండా (2026-27) లో భాగంగా, నోట్లపై సరికొత్త , అప్‌గ్రేడెడ్ సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. తన లాంగ్ టర్మ్ ప్లాన్ 'ఉత్కర్ష్ 2029' (Utkarsh 2029) ప్రోగ్రామ్ కింద కరెన్సీ నోట్ల నాణ్యతను, మన్నికను పెంచడంతో పాటు, నకిలీలు సృష్టించడానికి వీల్లేని విధంగా సరికొత్త సాంకేతికతను తీసుకురాబోతోంది. కాబట్టి, మీరు కూడా బ్యాంకు నుండి లేదా ఎవరి దగ్గరైనా రూ. 500 నోట్లు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు గాంధీ బొమ్మ, గ్రీన్ స్ట్రిప్ (సెక్యూరిటీ థ్రెడ్) సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది!


Click it and Unblock the Notifications