వందలమందిని రోడ్డునపడేసిన ఐటీ కంపెనీ.. ఏడుస్తున్న తెలుగు టెక్కీలు..!!
Hyderabad News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అవ్వాలి అనే కల ఉన్న ప్రతి ఒక్కరు తమ చదువు పూర్తయ్యాక వచ్చేది హైదరాబాద్ నగరానికి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సర్వ సాధారణం. ముందుగా మార్కెట్లో అవసరమైన టెక్ స్కిల్స్ నేర్చుకోవటానికి అమీర్ పేట్ వచ్చి నేర్చుకుంటుంటారు. ఐటీ ఉద్యోగం అనగానే హైదరాబాద్ లేదా బెంగళూరు ఈ రెండింటిలోనే తెలుగువారు ఎక్కువగా ఉంటుంటారు.
అయితే ఇటీవలి కాలంలో హైదరాబాదులో వరుసగా అనేక చిన్న మధ్య స్థాయి ఐటీ కంపెనీలు వరుసగా బోర్డు తిప్పేస్తున్న వార్తలు చాలా మందిని కలవరానికి గురిచేస్తున్నాయి. కలల ఉద్యోగం సంపాదించాం అని సంతోషపడేలోగా కంపెనీ మూసివేయటం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతనెల మాదాపూర్ కావూరీ హిల్స్ ఏరియాలో ఇలాంటి సంఘటనే జరగగా తాజాగా మరోటి వెలుగులోకి వచ్చింది. ఈసారి మాదాపూర్ లోని ఏ అండ్ ఏ లేక్ ఫ్రట్ భవనంలోని మొదటి అంతస్థులో కెరియర్ పీడీయా ఎడ్యుటెక్ లిమిటెడ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు కంపెనీ తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి కెరియర్ పీడీయా ఎడ్యుటెక్ లిమిటెడ్ ఐటీ ఉద్యోగాలు ఇప్పిచటంతో పాటు సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగానికి అవసరమైన స్కిల్ శిక్షణ ఇప్పించేందుకు ఆశావహుల నుంచి గరిష్ఠంగా రూ.లక్షన్నర వరకు దండినట్లు తేలింది. ప్రస్తుతం కంపెనీ బోర్డు తిప్పేయటంతో చాలా మంది బాధితులు దీనిపై మాదాపూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడైంది. దీనికోసం అప్పులు కూడా చేసినట్లు కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. మూడు నెలల ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ ఇస్తామని తమకు తొలుత సంస్థ హామీ ఇచ్చిందని అయితే ప్రస్తుతం తాము దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయినట్లు వారు చెబుతున్నారు. అయితే కంపెనీ మాత్రం ఇది అసత్య ప్రచారంగా పేర్కొంటోంది.
హైదరాబాదులో పెరిగిపోయిన నకిలీ సంస్థలు..!
రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరగటానికి అసలు కారణం ఐటీ ఉద్యోగాలే కావాలని యువత వెంపర్లాటలో నకిలీ సంస్థలను ఆశ్రయించటమే. అవును ఈ నకిలీ సంస్థలు ఇప్పుడు పెద్ద పరిశ్రమ స్థాయికి చేరుకున్నాయి. వీటిలో ఇచ్చే అనుభవం నుంచి ఇంటర్వ్యూల వరకు అంతా పచ్చి మోసమే. ఉద్యోగం కావాలని సంప్రదిస్తే చాలు ట్రైనింగ్ నుంచి ప్లేస్మెంట్ వరకు అన్నీ తామే చూసుకుంటాం అంటూ లక్షల్లో దోచుకుంటున్నారు.
కరోనా తర్వాత కాలంలో ఐటీ ఉద్యోగులకు ఒక్కసారిగా డిమాండ్ పెరగటంతో చాలా టెక్ కంపెనీలు సైతం అభ్యర్థులు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్నట్లు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వదిలేశాయి. మరోపక్క పోలీసులు సైతం ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టడానికి ఫిర్యాదులు ముఖ్యమని అంటున్నారు. మెుత్తానికి బెంగళూరు తర్వాత అత్యధికంగా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్న హైదరాబాద్ నగరం పేరును ఈ ఫేక్ కంపెనీలు మసకబారుస్తున్నాయి.


Click it and Unblock the Notifications