మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. మూడోరోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడు అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
ఈ పరిణామాల మధ్య రష్యాను నిలువరించడానికి అంతర్జాతీయ వేదికలపైనా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ వారం రోజుల వ్యవధిలో ఈ భేటీ ఏర్పాటు కావడం ఇది మూడోసారి. దీన్ని బట్టి చూస్తే- రష్యాను అడ్డుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఏ స్థాయిలో తనవంతు ప్రయత్నాలను సాగిస్తోందనేది అర్థం చేసుకోవచ్చు. భద్రత మండలిలో ఓటింగ్‌ను సైతం నిర్వహించింది.

యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా.. ఇలా ఒక్కటని కాదు- దాదాపు అన్ని దేశాలు ఆయన వైఖరిని తప్పుపడుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి దిగడానికీ సమాయాత్తమౌతున్నాయి. రష్యాపై కౌంటర్ అటాక్‌కు దిగడానికి సన్నద్ధమౌతోన్నాయి. భారత్ మాత్రం తటస్థ వైఖరిని అనుసరించింది. రష్యాకు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా మొగ్గు చూపలేదు
మరోవంక- రష్యా ప్రభుత్వం.. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న వారెవరినీ వదలట్లేదు- చివరికి స్వదేశీయులను కూడా. యుద్ధాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన వేలాదిమంది నిరసనకారులను పుతిన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది. ఇప్పటిదాకా 2,500 మందిని అరెస్ట్ చేశారు. యుద్ధాన్ని ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వుయ్ డోన్ట్ నీడ్ వార్ అంటూ నినదించారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నిరసనకారులపైనే కాదు.. చివరికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా రష్యా ప్రభుత్వం నిఘా ఉంచింది. నిబంధనలను ఉల్లంఘించినందున- సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పైనా ఆంక్షలు విధించింది. ఇది పాక్షికమే అయినప్పటికీ- దాన్ని మరింత విస్తృతం చేసే అవకాశాలు లేకపోలేదు. ఫ్యాక్ట్ చెక్కర్స్, కంటెంట్ వార్నింగ్ లేబిల్స్‌ను నిలిపివేయాలంటూ రష్యా అధికారులు చేసిన ఆదేశాలను పాటించకపోవడం వల్ల వాటిపై ఆంక్షలను విధించినట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీనియర్ అధికారి నిక్ క్లెగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications