Facebook Meta: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. కంపెనీ వరుసగా రెండో క్వార్టర్ లోనూ తక్కువ ఆదాయాలను నమోదు చేయటంతో కంపెనీకి కష్టాలు మరింత పెరిగాయి. పైగా కంపెనీ ఆదాయం గతంతో పోల్చితే 4 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం ఇది 27.71 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

చేటు చేస్తున్న మెటావర్స్..
మార్క్ జుకర్‌బర్గ్ కలల ప్రాజెక్ట్ మెటావర్స్ ప్రాజెక్ట్‌పై భారీగా వెచ్చించటం కంపెనీకి పెద్ద గండి కొట్టింది. మెటా రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అది అంతకుముందు కంటే ఎక్కువ. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీపై నమ్మకాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది.
వాల్ స్ట్రీట్ పతనం..
ఇటువంటి పరిస్థితుల్లో మెటా షేర్లు వాల్ స్ట్రీట్ లో భారీగా పతనం అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే మెటా షేర్ ఏకంగా 25 శాతం పతనమైంది. దీంతో ఈ ఏడాది కంపెనీ షేర్లు ఏకంగా 65 శాతం వరకు పతనం అయ్యాయి. కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ సైతం భారీగా ఆవిరై 67 బిలియన్ డాలర్లకు పైగా విలువ హరించుకుపోయింది. ఈ క్రమంలో మెటావర్స్ పై కంపెనీ వృధా ఖర్చు చేస్తోందంటూ ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈవో బ్రాడ్ గెర్స్ట్నర్.. మార్క్ జుకర్ బర్క్‌కు లేఖ రాశారు.

మెటాపై ఉదయ్ కోటక్..
దేశంలోని ప్రఖ్యాత ప్రైవేట్ రంగం బ్యాంక్ కోటక్ మహీంద్రా హెడ్ ఉదయ్ కోటక్ ఫేస్ బుక్ పై తొలిసారిగా ట్విట్టర్ లో స్పందించారు. కేవలం ఒక్క రోజే షేర్లు 25 శాతం పతనమయ్యాయని, అమెజాన్ షేర్లు సైతం ఇదే బాటలో నేడు పయనిస్తాయని ఆయన అన్నారు. అయితే స్టాక్ మార్కెట్ ఎకానమీని ప్రతిబింబిస్తూ.. కంపెనీలకు మూల ధనాన్ని, సరైన వ్యాల్యుయేషన్లను అందిస్తుందా..? లేక ఇదొక క్యాసినోనా అంటూ ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో భారత వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మెటావర్స్ లోకి ప్రవేశించటం సంచలనంగా మారింది.

విలువ కోల్పోతున్న టాప్ కంపెనీలు.
ప్రస్తుతం గడచిన ఏడాది కాలంగా అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పడిపుతున్నాయి. టాప్-7 టెక్ కంపెనీలు ఏడాదిలో ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, టెస్లా, నెట్ ఫ్లిక్స్, యాపిల్ కంపెనీలు భారీగా విలువను కోల్పోయాయి.


Click it and Unblock the Notifications