రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రూ.43,574 కోట్ల (5.7 బిలియన్ డాలర్లు)తో 9.9% వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో రిలయన్స్ జియో భాగం. ఈ పెట్టుబడి ద్వారా రిలయన్స్‌ను డెబిట్ లెస్‌గా మార్చేందుకు మరో కీలక అడుగు పడింది రిలయన్స్‌కు.

కలిసి ముందుకు
రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో, ఫేస్‌బుక్ ఇంక్ కలిసి ముందుకు సాగనున్నాయి. కలిసి పని చేయాలనే జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్ పెట్టుబడి కోసం బైండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఫేస్‌బుక్ ఇన్వెస్ట్ చేసిన ఈ మొత్తం జియో ప్లాట్ ఫాంకు రూ.4.62 లక్షల కోట్ల ప్రీ-మనీ ఎంటర్‌ప్రైజ్ విలువకు సమానం. జియో వ్యాల్యూ రూ.4.62 లక్షల కోట్లు (65.95 బిలియన్లు) వద్ద ఈ డీల్ జరిగింది.

జియో అదుర్స్
ఓ టెక్నాలజీ సంస్థ మైనార్టీ వాటా కోసం ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడి ప్రపంచంలో ఇదేనని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియాలోని టెక్నాలజీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని తెలిపింది. జియో ప్రారంభమైన మూడున్నరేళ్లలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా పెట్టుబడుల పరంగా టాప్ 5 లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని తెలిపింది.

ముఖేష్ అంబానీ..
ఈ డీల్ పైన ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఇండియా డిజిటల్ సర్వోదయ లక్ష్యంతో 2016లో జియోను ప్రారంభించామని, దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా తీసుకు వచ్చామని, ఇప్పుడు జియోలోకి ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జియో, ఫేస్‌బుక్ సమాహారం డిజిటల్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు.

మార్క్ జుకర్ బర్గ్
ప్రజలు, వ్యాపారం కోసం ఫేస్‌బుక్, జియో జత కట్టాయని, సరికొత్త మార్గాలు అన్వేషిస్తాయని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీకి తమ బంధం దోహదం చేస్తుందన్నారు. కీలక ప్రాజెక్టుల్లో సంస్థలు కలిసి పని చేస్తాయని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో జియో కోట్లాది మంది చిన్న వ్యాపారులకు, వీటిపై ఆధారపడిన వారికి సహకరిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications