F&O News: దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఏడాది గతంలో ఎన్నడూ చూడని రీతిలో బుల్ జోరు కనిపించింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ భారీగా పెరగటమే. దీంతో చాలా మంది యువ ట్రేడర్లు తక్కువ సమయంలో రాబడి కోసం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేందుకు మక్కువ చూపిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో మార్కెట్లో డెరివేటివ్ ట్రేడింగ్ కారణంగా ఓలటాలిటీ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనిని అరికట్టడానికి చేపట్టిన రెగ్యులేటరీ చేంజెస్ ప్రస్తుతం పెద్ద మార్పుకు కారణం అవుతున్నాయి. దీని కారణంగా ప్రతిరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లలో గతంలో కనిపించిన స్థాయిలో ట్రేడర్లు పార్టిసిపేట్ చేయకపోవటం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఓలటాలిటీ కేవలం కాంట్రాక్ట్ ఎక్స్‌పెయిరీ తేదీలకు మాత్రమే పరిమితం అయినట్లు అనలిస్టులు చెబుతున్నారు.

ఈ క్రమంలో సెబీ కాంట్రాక్టు సైజును పెంచటంతో ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ పరిమాణాన్ని గతంలో ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచటంతో నవంబర్ నుంచి పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ తగ్గినట్లు గమనించబడింది. ప్రముఖ ఇన్వెస్టర్ పీఆర్ సుందర్ తాజా ట్వీట్ పరిశీలిస్తే గడచిన 3 నెలల కాలంలో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఏకంగా 50 శాతం మేర పడిపోయిందని పేర్కొన్నారు. ఇదే విషయంపై దేశీయ బ్రోకరేజ్ జెరోధా స్పందిస్తూ 2025లో ట్రేడింగ్ మరింతగా తగ్గవచ్చని అంచనా వేసింది. సెబీ చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటికే డెరివేటివ్స్ ట్రేడింగ్ యాక్టివిటీ దాదాపు 30 శాతం పడిపోయిందని వారం కిందట వెల్లడించింది.
అక్టోబరు నుంచి సగటు రోజువారీ ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ పరిశీలిస్తే దాదాపు సగానికి తగ్గినట్లు తాజా డేటా ప్రకారం వెల్లడైంది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ అక్టోబరులో రూ.3,90,98,126 కోట్లుగా ఉన్న టర్నోవర్ ప్రస్తుతం జనవరిలో రూ.1,97,56,652 కోట్లకు తగ్గిందని వెల్లడైంది. సెబీ చర్యల తర్వాత.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తమ బ్యాంక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రతివారం ఎక్స్పెయిరీని ఆపేశాయి. ఇలాంటి చర్యల కారణంగా రోజువారీ ఎఫ్అండ్ఓ పార్టిసిపేషన్ భారీగా క్షీణించినట్లు డేటా ప్రకారం తెలుస్తోంది. అయితే ఎక్స్ పెయిరీ తేదీల్లో మాత్రం ఒక్కసారిగా సూచీల్లో 100-150 పాయింట్ల పెరుగుదలను ఎదుర్కోవటంలో రిటైల్ పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని రెలిగేర్ బ్రోకింగ్ ప్రతినిధి అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విషయంలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కాంట్రాక్టుల్లో అత్యధిక ఓలటాలిటీ ఉంటుంది. అయితే దానిని ప్రస్తుత నిఫ్టీ ఫ్యూచర్లకు తరలించటం జరిగింది. వాస్తవానికి నిఫ్టీలో లిక్విడిటీ ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా మోతీలాల్ ఓస్వాల్ ప్రతినిధి చందన్ తపారియా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఎన్ఎస్ఈ కొత్తగా 6 కంపెనీల షేర్లను ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కోసం అనుమతించిన సంగతి తెలిసిందే. మార్కెట్లోకి వస్తున్న చాలా మంది ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ వల్ల లాభం కంటే నష్టాలను చవిచూస్తున్నట్లు గణాంకాలు చెబుతున్న వేళ సెబీ ఈ చర్యలు తీసుకుంది. సాధారణ ప్రజలను ఇలాంటి రిస్కీ ట్రేడింగ్ కి దూరంగా ఉంచేందుకు చేపట్టిన ప్రయత్నాలు ప్రస్తుతం ఫలితాలను చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications