Q4 Results: ప్రస్తుతం ఏప్రిల్ 1తో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. దేశంలోని ఐటీ సేవల కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ముందుగా టీసీఎస్ తన క్యూ4 ఫలితాలతో సీజన్ స్టార్ట్ చేస్తుండగా తర్వాత ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ సహా ఇతర కంపెనీలు ఫలితాల ప్రకటనకు రెడీ అవుతున్నాయి.
మార్చి 2024 త్రైమాసికంలో భారత ఐటీ సేవల కంపెనీలు ఎడతెగని ఎదురుగాలుల మధ్య బలహీనమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. దీనిపై మార్కెట్లోని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజమైన టీసీఎస్ క్యూ4 ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనుండగా.. ఇన్ఫోసిస్ ఏప్రిల్ 18న, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఏప్రిల్ 26న మార్చితో ముగిసిన కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించటానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.

కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన నోట్‌లో ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని, దాదాపు 1.5 శాతం సీక్వెన్షియల్ ఆదాయాల్లో క్షీణత ఉందని పేర్కొంది. విప్రో, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా కూడా వరుసగా ఆదాయ క్షీణతను నివేదిస్తాయని అంచనా వేసింది. మరో పక్క ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం.. నాలుగో త్రైమాసిక పనితీరులో మిడ్-క్యాప్ IT కంపెనీలు లార్జ్‌క్యాప్‌లను అధిగమించవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో డివిడెండ్ ప్రకటనలు ఎలా ఉంటాయని చాలా మంది పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా TCS వద్ద సహేతుకమైన మార్జిన్ మెరుగుపడుతుందని అంచనా వేసింది. అలాగే విప్రో తన ఆదాయ మార్జిన్లలో స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తుందని అంచనాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రధానంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు చెందిన పెద్ద క్లయింట్ల నుంచి కాంట్రాక్టులను పొందాలని చూస్తున్నప్పటికీ ఖర్చుల మదింపులో భాగంగా చాలా కంపెనీలు కొత్త డీల్స్ చేసుకోకపోవటం కొనసాగటం కంపెనీల భవితవ్యంపై ఆందోళనలకు ప్రేరేపిస్తోంది. ఇన్వెస్టర్లు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ తమ పెట్టుబడులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications