Yes Bank: సూపర్ ర్యాలీలో యెస్ బ్యాంక్ స్టాక్.. అందుకే ఇన్వెస్టర్లు ఎగబడి కొంటున్నారు..!
Trending Stock: దేశంలోని చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలోని షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది దృష్టి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న యెస్ బ్యాంక్ షేర్లపై పడింది.
ఇటీవల దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కొత్తగా 9 శాతం వాటాలను యెస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకుల్లో పెంచుకునేందుకు రిజర్వు బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో చాలా మంది యెస్ బ్యాంక్ షేర్లను కొనేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కంపెనీ షేర్ ధర 6 శాతానికి పైగా పెరిగి రూ.27.15కు చేరుకుంది. దీంతో షేర్ కొత్త 52 వారాల గరిష్ఠ ధరను తాకింది.

గడచిన రెండు రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు 17% కంటే ఎక్కువ పెరిగాయి. యెస్ బ్యాంక్‌లో తన వాటాను 9.5 శాతానికి పెంచుకోవడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూప్‌కు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించింది. ఈ ఆమోదం తర్వాత యెస్ బ్యాంక్ షేర్లలో బలమైన పెరుగుదల కొనసాగుతుండగా.. షేర్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీనికి ముందు యెస్ బ్యాంక్ షేర్లు ఇన్వెస్టర్లను చాలా కాలం పాటు నిరీక్షించేలా చేశాయని మార్కెట్ విశ్లేషకుడు కుష్ బోహ్రా చెప్పారు. దాదాపు మూడేళ్ల తర్వాత స్టాక్ తిరిగి పుంజుకుంటోంది.
నవంబర్ 2023లో యెస్ బ్యాంక్ షేర్లు రూ.16 స్థాయిలో ట్రేడవుతుండగా.. ప్రస్తుతం మాత్రం రూ.26 దాటాయి. బ్యాంకు షేర్లు ఈ స్థాయిని దాటితే తమ తదుపరి లక్ష్యం రూ.35 అవుతుందని బోహ్రా చెప్పారు. ఒకవేళ యెస్ బ్యాంక్ షేర్లు కీలకమైన రూ.35 మార్కును విజయవంతంగా బ్రేక్ చేస్తే రానున్న కాలంలో రూ.45 స్థాయికి చేరుకుంటాయని బోహ్రా తన అంచనాలను వెల్లడించారు. దీంతో చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచనతో యెస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
గత కొన్ని నెలలుగా మంచి పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 23, 2023న యెస్ బ్యాంక్ షేర్లు రూ.14.10 వద్ద ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్ షేర్లు 7 ఫిబ్రవరి 2024న రూ.27.15కి చేరుకున్నాయి. అంటే కేవలం గత 4 నెలల కంటే తక్కువ కాలంలో.. యెస్ బ్యాంక్ షేర్లు 90% కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే 6 నెలల కాలాన్ని పరిశీలిస్తే యెస్ బ్యాంక్ షేర్లు 60% పైగా వృద్ధి చెందాయి. ఇటీవల కంపెనీ ప్రకటించిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం ఏకంగా రూ.231 కోట్లకు చేరుకోవటం ఉత్తమ పనితీరుకు అద్ధం పడుతోంది.


Click it and Unblock the Notifications