RBI Rate Cut: 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఊరట.. ఈసారి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ..
RBI MPC Meeting: గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా.. ఈయూ సెంట్రల్ బ్యాంక్ మాత్రం రేట్ల తగ్గింపును కొనసాగించింది. అయితే ఒకపక్క గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో ఊరటను కలిగిస్తుండగా.. భారతీయులు సైతం ఇప్పుడు అదే కోరుకుంటున్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత భారతీయ మధ్యతరగతి ప్రజలకు రిజర్వు బ్యాంక్ నుంచి మరో శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీ రేట్ల కోత ప్రకటిస్తారని చాలా మంది అంచనా వేస్తున్నారు. జీడీపీ వృద్ధి మందగమనం మధ్య శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది.

నిపుణుల అంచనా ప్రకారం ఈసారి మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర గవర్నర్ తగ్గింపు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ టార్గెట్ రేటు 4 శాతం కంటే ఎక్కువగా కొనసాగటం రిజర్వు బ్యాంకుకు పెద్ద సవాలుగా మారింది.
దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రభుత్వం ముందస్తు అంచనాల నడుమ.. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ప్రజల వద్ద లిక్విడిటీని పెంచే చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్యలు వడ్డీ రేట్ల తగ్గింపుకు తగిన మద్దతు అందిస్తాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో గతవారం రిజర్వు బ్యాంక్ దేశీయ బ్యాంకుల్లోకి అదనంగా రూ.1.5 లక్షల కోట్ల డబ్బును ఇన్ ఫ్జూజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది డిసెంబరులో రూ.1.16 లక్షల కోట్ల నిధులను అందించిన తర్వాత రావటం గమనార్హం. క్యాష్ రిజర్వు రేషియోలో ఈ మేరకు మార్పులు చేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులో వడ్డీ రేట్ల కోత చాలా ముఖ్యమైన, అనివార్యమైన చర్యగా నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో భారతదేశంలో రేటు తగ్గింపు ఉంటుందని భావిస్తున్నట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరా సేన్‌గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. కూరగాయల కారణంగా ఆహార ధరల్లో గణనీయమైన తగ్గుదల జనవరిలో సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 4.5%కి తీసుకువచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications