Bengaluru: లక్షల జీతం వదులుకొని ఐస్ క్రీం షాప్..! అప్పుడు నవ్వుకున్నవాళ్లే ఇప్పుడు మెచ్చకుంటున్నారట!
జీవితంలో బాగా స్థిరపడటం అంటే ఏంటి? ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ జీతం వచ్చే ఉద్యోగం, ఆఫీస్ కారు, అందమైన కుటుంబం.. ఇవే కదా మనందరం అనుకునేది. కానీ బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రదీప్ కన్నన్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. ఓరాకిల్ ఇండియా వంటి దిగ్గజ సంస్థలో ఆపరేషన్స్ హెడ్‌గా చేస్తున్న వ్యక్తి.. అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఐస్ క్రీం అమ్ముతానంటే సమాజం ఎలా స్పందిస్తుంది? సరిగ్గా ప్రదీప్ విషయంలో కూడా అదే జరిగింది.

అందరూ నవ్వారు.. కానీ ఆయన తగ్గలేదు
2019 లో ప్రదీప్ తన సుఖవంతమైన ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు అందరూ ఆయనను చూసి నవ్వుకున్నారు. "అంతా సెటిల్ అయ్యాక ఈ ఐస్ క్రీం షాపులేంటి?" అని చాలా మంది ప్రశ్నించారు. కానీ, తనలో ఉన్న వ్యాపార తపన ప్రదీప్ ను ముందుకు నడిపించింది. బెంగళూరు వదిలి తన సొంత ఊరు కరూర్ (తమిళనాడు) వెళ్ళి 'ది ఫలూదా షాప్' (The Falooda Shop) ప్రారంభించారు. నేడు ఆ చిన్న షాపు.. ఇండియా, దుబాయ్‌లో కలిపి 18 అవుట్‌లెట్లతో ఒక పెద్ద ఐస్ క్రీం చైన్‌గా ఎదిగింది.
మొదటి షాపు పెట్టడానికి ఎంత ఖర్చయ్యింది?
వ్యాపారం ప్రారంభించాలనుకునే యువత కోసం ప్రదీప్ ఇటీవల తన మొదటి అవుట్‌లెట్ పెట్టుబడి వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బెంగళూరు (Bengaluru) లో ఒక ఫుడ్ అవుట్‌లెట్ ప్రారంభించాలంటే సుమారుగా రూ. 22 లక్షల బడ్జెట్ అవసరమని ఆయన వివరించారు. ఆ ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి..
- రెంటల్ డిపాజిట్: రూ.2.4 లక్షలు.
- ఫర్నిచర్, ఇంటీరియర్స్: దీనికి అత్యధికంగా రూ.10 లక్షలు ఖర్చు చేశారు.
- లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు: రూ. 60,000.
- ఇతర పరికరాలు (Equipment): రూ. 2 లక్షలు.
- ముడి సరుకులు, ప్యాకేజింగ్: రూ.3.2 లక్షలు.
- బ్రాండింగ్, మార్కెటింగ్: రూ.1 లక్ష.
- స్టాఫ్ శాలరీలు (మొదటి నెల): రూ. 80,000.
- వర్కింగ్ క్యాపిటల్: రూ. 2 లక్షల బఫర్ అమౌంట్ ఉంచుకున్నారు.
ప్రదీప్ ఇస్తున్న సలహా
"షాపు ఇంటీరియర్స్‌ను ఆర్భాటంగా (Fancy) డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ వస్తువు రుచి బాగుండి, కస్టమర్లు మళ్లీ మళ్లీ మీ దగ్గరకు వస్తే అదే నిజమైన సక్సెస్" అని ప్రదీప్ కన్నన్ అంటారు. ఒక NIFT గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. తన డిజైనింగ్ నైపుణ్యాన్ని, ఓరాకిల్‌లో నేర్చుకున్న మేనేజ్‌మెంట్ పాఠాలను వ్యాపారంలో చక్కగా ఉపయోగించుకున్నారు.
ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) లో ఎన్నో స్టార్టప్ లు వస్తున్నా, ఫూడ్ రంగంలో స్థిరపడటం అంత సులభం కాదు. కానీ తన మీద తనకు ఉన్న నమ్మకంతో ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఐస్ క్రీం రంగంలో ప్రదీప్ సాధించిన విజయం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. మీరు కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కేవలం సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా ముందడుగు వేయడమే విజయానికి తొలిమెట్టు.


Click it and Unblock the Notifications