Bus offers: బస్సు ప్రయాణీకులకు బంపర్ ఆఫర్.. రూ.100 లోపే ఆ నగరాలు చుట్టేయెచ్చు
Bus ticket for 99: పెరుగుతున్న జనాభాకు సరిపడే స్థాయిలో రవాణా సౌకర్యాలు ఉండటం లేదు. వివిధ నగరాల మధ్య బస్సు సర్వీసులకు మంచి డిమాండ్ ఉండటంతో పలు సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. సాంప్రదాయ డీజిల్ వాహనాల స్థానంలో కొత్త తరం ఇంధన వనరులతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఓ యూరోపియన్ బస్సు ఆపరేటర్ దక్షిణ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే గొప్ప ఆఫర్ అందిస్తోంది.
సౌత్ ఇండియాలోకి కొత్తగా ప్రవేశించిన 'ఫ్లిక్స్ బస్' సంస్థ కేవలం 99 కే పలు నగరాలకు ప్రయాణ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. FlixBus యాప్ మరియు వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేయడం ద్వారా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 6 మధ్య అన్ని గమ్యస్థానాలకు 99 కే ప్రయాణించడానికి వీలు కలుగుతుంది.

ఈ బస్సు సర్వీసులు చెన్నై, హైదరాబాద్, బెళగావి, కోయంబత్తూర్, మధురై మరియు విజయవాడలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాగా త్వరలోనే ఇతర గమ్యస్థానాలకు సైతం తమ సేవలను విస్తృత పరచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో ఫ్లిక్స్‌బస్ సేవలను పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి MB పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం 12 బస్సులతో ఈ కొత్త ఆపరేటర్ జర్నీ స్టార్ట్ చేసి 99 కే పరిమిత కాల ఆఫర్ లాంచ్ చేసింది.
టెక్ ఆధారిత ట్రావెల్ మోడల్ మరియు కస్టమర్-సెంట్రిక్ విధానంతో ఇంటర్‌సిటీ ట్రావెల్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని యాజమాన్యం చెబుతోంది. యూనివర్సల్ బస్ సర్వీసెస్, జగన్ ట్రావెల్స్, అన్నే ట్రావెల్స్, జై శ్రీ ట్రావెల్స్, సమన్వి ట్రావెల్స్ మరియు వరుణ్ ట్రావెల్స్‌తో సహా 6 స్థానిక ట్రావెల్ ఆపరేటర్‌లతో ఫ్లిక్స్ బస్ భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. కొత్త బస్సులను ప్రకాష్ కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అశోక్ లేలాండ్ తయారుచేశాయి.


Click it and Unblock the Notifications