హార్ముజ్ జలసంధి మూసివేత.. భారత్‌కు ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణంతో పరిస్థితులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో.. ఈ ప్రాంతం పూర్తిగా ఉద్రిక్తకరంగా మారింది. గతంలో వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా బందీగా తీసుకెళ్లిన ఘటన పెద్ద స్థాయిలో సంక్షోభంగా మారకపోయినా.. ఇరాన్ విషయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), అలాగే ఇరాన్ ప్రజల స్పందన చాలా కఠినంగా ఉండే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) హెచ్చరిస్తోంది.
ఈ పరిణామాల ప్రభావం నేరుగా ప్రపంచ చమురు మార్కెట్లపై పడే అవకాశముంది. ప్రత్యేకంగా చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై అందరి దృష్టి పడింది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం జరుగుతుంది. భారత్‌కు అవసరమైన చమురులో 35 నుంచి 50 శాతం వరకు ఇదే మార్గం ద్వారా వస్తోంది. ఈ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేస్తే.. ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ జలసంధిని ఇరాన్ మూసివేస్తూ వస్తోంది.

33 కిలోమీటర్ల పొడవైన హార్ముజ్ జలసంధి మూసివేత జరిగితే చమురు నౌకలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధరలు 70 నుంచి 73 డాలర్ల పరిధిలో ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు పెరిగితే అవి 90 నుంచి 100 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి వచ్చే సరఫరాలు అడ్డంకులకు గురైతే.. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ అవుతుంది.
భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారీగా పెరిగి, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గే ప్రమాదం కూడా ఉంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ చమురు దిగుమతులపై భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. ఈ దిగుమతుల్లో సగానికి పైగా సరఫరా పశ్చిమాసియా నుంచే రావడం మరో కీలక అంశం. ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాలు భారత్‌కు ప్రధాన సరఫరాదారులు. ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే, సరఫరా ఆలస్యం, భీమా ఖర్చుల పెరుగుదల, రవాణా వ్యయాల భారమూ భారత్‌పై పడే అవకాశం ఉంది.
మరో అంశంగా భారత్ రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవాల్సి రావచ్చు. అయితే ఇది కూడా ఎక్కువ ఖర్చు, ఎక్కువ రవాణా సమయం వంటి సవాళ్లను తెస్తుంది. స్వల్పకాలంలో చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లను మించితే, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఇరాన్‌పై పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇప్పటికే భారత్-ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం పరిమితంగానే ఉంది. 2025లో భారత్ నుంచి ఇరాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో ప్రధానంగా బియ్యం, అరటిపండ్లు, టీ ఉన్నాయి. అక్కడి నుంచి భారత్‌కు పెట్రోలియం కోక్, యాపిల్స్, ఖర్జూరం వంటి వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని తమ హైఫా పోర్ట్ పూర్తిగా సురక్షితంగా ఉందని Adani Group వెల్లడించింది. కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు.. హార్ముజ్ మార్గంలో రవాణా ప్రమాదాల నేపథ్యంలో.. కొత్త సీఐఎఫ్ (కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్) ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని Indian Rice Exporters Federation తమ సభ్యులకు సూచించింది. వీలైనంత వరకు ఎఫ్‌ఓబీ నిబంధనలపై ఎగుమతులు చేయాలని కోరింది.
ఈ కీలక పరిణామాల నేపథ్యంలో.. ఆరు దేశాల Gulf Cooperation Councilతో భారత్ కుదుర్చుకోవాల్సిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఆలస్యం కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో కోట్లాది భారతీయుల జీవనం, భారీ వాణిజ్య లావాదేవీలు ఉండటంతో, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై విస్తృతంగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications