ఆందోళన వద్దు: ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లు ఇటీవలి కాలంలో వేగంగా పుంజుకున్నాయి. సరికొత్త జీవనకాల గరిష్టాలను తాకాయి. కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెలలో సెన్సెక్స్ 26వేల దిగువకు, నిఫ్టీ 7600కు పడిపోయింది. ఇప్పుడు నిఫ్టీ 13,258 పాయింట్లతో, సెన్సెక్స్ 45,000 మార్కు దాటి కొత్త శిఖరాలను అందుకున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయనే సంకేతాలు వచ్చాక గత రెండు నెలలుగా ఈక్విటీ మార్కెట్లు అంతకంతకూ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.

నెలలో అంతకంతకూ... కరెక్షన్ ఉండవచ్చు
కరోనాకు ముందు ఈ ఏడాది జనవరి నెలలో సెన్సెక్స్ మొదటిసారి 42,000 మార్కును క్రాస్ చేసింది. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాల వేగవంత సూచన నేపథ్యంలో గత నెల ప్రారంభంలో సెన్సెక్స్ ఈ రికార్డును దాటింది. ఆ తర్వాత కొద్ది సెషన్‌లలోనే 43వేల మర్కుకు చేరుకుంది. ఆ తర్వాత నవంబర్ 17, 18 తేదీల్లో 44,000ను అందుకుంది. ఆతర్వాత గత వారంలో 45,000 సరికొత్త శిఖరాలను తాకింది. నెల రోజుల్లోనే 42వేల దిగువ నుండి 45వేల పైకి చేరుకుంది. నిఫ్టీ కూడా అదే వేగంతో పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, కరెక్షన్ ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ఆందోళన వద్దు...
జనవరిలో సెన్సెక్స్ 42వేల మార్కు అందుకున్న తర్వాత కరోనా కారణంగా మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత వేగంగా పెరుగుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టారు. అయితే అంతలోనే దిద్దుబాటుకు గురయితే... ఆందోళనతో వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా చేస్తుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి భారీగా ఎగిసినప్పుడు పెట్టుబడులు పెట్టడం... అదే సమయంలో కరెక్షన్‌కు గురైనప్పుడు ఒత్తిడితో వెనక్కి తీసుకోవడం వంటివి సరికాదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఈక్విటీ మార్కెట్ల జోరు ఎందుకు?
అమెరికా సహా యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో భారత్‌లో తగ్గుముఖం పట్టింది. అలాగే మన వద్ద కార్యకలాపాలు పుంజుకున్నాయి. దీంతో మన మార్కెట్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. నవంబర్ నెలలోనే అరవై వేల కోట్లకు పైగా FPIలు వచ్చాయి. దీంతో మార్కెట్లు ఎగిసిపడుతున్నాయి. అయితే మార్కెట్లో బబుల్ క్రియేట్ అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టం వద్ద సూచీలు ఉన్న ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టే సమయంలోను... ఎంచుకునే రంగాలు.. కంపెనీల్లోను అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.


Click it and Unblock the Notifications