రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈపీఎస్ పెన్షన్ (EPS Pension) కనీస పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కనీస పింఛను (Minimum Pension) కేవలం రూ. 1,000 మాత్రమే ఉండగా, దానిని కనీసం రూ. 7,500 లేదా అంతకంటే ఎక్కువ (రూ. 8,000 వరకు) పెంచాలని EPS 95 Pension లబ్ధిదారులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రశ్న వచ్చినప్పుడు, కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పెన్షన్ పెంపుపై తమ వైఖరిని స్పష్టం చేశారు. దీంతో ఇప్పట్లో కనీస పెన్షన్ పెంపునకు అవకాశాలు లేవని తేలిపోయింది.
కనీస పెన్షన్ పెంపుపై మంత్రి వివరణ
పెన్షన్ పెంపు ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, ప్రస్తుతం EPS Pension మొత్తాన్ని పెంచే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఆమె ఈ నిర్ణయానికి గల కారణాలను కూడా వివరించారు.

ఉద్యోగుల పెన్షన్ నిధి (Employees' Pension Fund) కి సంబంధించిన ఫండ్ ప్రస్తుతం లోటులో ఉందని పింఛనుదారులకు చెల్లింపులు చేయడానికి నిధులు సరిపోని పరిస్థితి ఉందని అమె అన్నారు. ఈ ఫండ్‌కు సరైన రాబడి రాకపోవడం కూడా లోటుకు ఒక కారణం. ప్రస్తుతం కనీస పింఛను రూ. 1,000 చెల్లించేందుకు కూడా ఫండ్ నుంచి వచ్చే ఆదాయం సరిపోవడం లేదని. కాబట్టి, ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ నుంచి అదనపు నిధులను సమకూర్చాల్సి వస్తోందని అమె స్పష్టం చేశారు. కాబట్టి ఈ అదనపు భారాన్ని దృష్టిలో ఉంచుకుని EPS Minimum Payout ను తక్షణమే పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో లేవని మంత్రి తేల్చి చెప్పారు.
నిధులు ఎలా సమకూరుతాయి?
ఈపీఎస్ (EPS) అనేది ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) లో ఒక భాగం. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇందులో ఉద్యోగి, యజమాని.. ఇద్దరూ ఉద్యోగి వేతనం నుండి 12% చొప్పున EPF లో జమ చేస్తారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
EPS పెన్షన్ ద్వారా లభించే ప్రయోజనాలు
EPS Pension కింద కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు లేదా వారి కుటుంబాలకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 1,000 మాత్రమే ఉన్నా, సర్వీస్, జీతం ఆధారంగా లబ్ధిదారులు గరిష్ఠంగా రూ. 7,500 వరకు పెన్షన్ పొందే వీలుంది. ఉద్యోగి 58 ఏళ్ల తర్వాత లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పెన్షన్ పొందవచ్చు. 50 ఏళ్ల నుంచే ముందస్తు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగి మరణిస్తే, జీవిత భాగస్వామికి, వారు లేకపోతే 25 ఏళ్లు వచ్చే వరకు పిల్లలకు ఈ పెన్షన్ అందుతుంది. పిల్లలు దివ్యాంగులైతే వారికి జీవితకాలం పెన్షన్ లభిస్తుంది.
ఏదేమైనా ప్రస్తుతానికి పెన్షనర్ల ఆశలు నిరాశపరిచినట్టయింది. నిధుల లోటు కారణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భవిష్యత్తులో పునరాలోచన ఉంటుందా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications