Google: గూగుల్‌కు చెమటలు పట్టించిన ఎపిక్ గేమ్స్.. భారత్‌లో CCI సీన్ కాలిఫోర్నియాలోనూ రిపీట్..
Fortnite: టెక్ దిగ్గజం గూగుల్ కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ఎప్పుడు చూసినా కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతూనే ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మొట్టికాయలు తిన్న అనంతరం భారత్ లో కొంతమేర గాడిన పడింది. అయితే ఇతర దేశాల్లోనూ గూగుల్ కు ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఎపిక్ గేమ్స్ విషయంలోనూ ఇదే జరిగింది.
గూగుల్ పై ప్రముఖ వీడియో గేమ్ 'ఫోర్ట్ నైట్' తయారీదారు ఎపిక్ గేమ్స్ గెలిచింది. నెలరోజుల పాటు జరిగిన విచారణ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన ఫెడరల్ జ్యూరీ.. ఎపిక్ గేమ్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్లే స్టోర్ పై గూగుల్ అక్రమ గుప్తాధిపత్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. ఎపిక్ గేమ్స్ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినట్లు నిర్ధారించింది.

ఈ తరహా గూగుల్ ప్రవర్తన కేవలం ఎపిక్ ను మాత్రమే ప్రభావితం చేయలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ పై ఆధారపడిన చాలామంది డెవలపర్లకు హాని కలిగించే విధంగా టెక్ దిగ్గజం చర్యలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ నిర్ణయం గూగుల్ కు అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్లే స్టోర్ నియమాలను మార్చవలసిన అవసరం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎపిక్ గేమ్స్ CEO టీమ్స్ స్వీనీ ఈ గెలుపుపై Xలో స్పందించారు. గూగుల్ మీద ఎట్టకేలకు ఘన విజయం సాధించినట్లు అందులో పేర్కొన్నారు. 4 వారాల వివరణాత్మక విచారణ తర్వాత గూగుల్ ప్లే గుత్యాధిపత్యానికి కాలిఫోర్నియా జ్యూరీ వ్యతిరేకంగా నిలిచినట్లు చెప్పారు. గూగుల్ విధానాలను కట్టడి చేసేందుకు జనవరిలో కోర్టు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనకు మద్ధతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications